Breaking News

ఏపీ డ్వాక్రా స‌భ్యుల‌కు PMFME – స్త్రీనిధి స‌రికొత్త పథకం

– ఆహార శుద్ధి రంగంలో సరికొత్త అవకాశాలు
– రు. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు యూనిట్ వ్య‌యంతో యూనిట్ ఏర్పాటు
– స్త్రీనిధి రుణంతో PMFME సబ్సిడీ
– డ్వాక్రా స‌భ్యులు కూలి స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
– మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్ది… వారు ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ఉపాధి క‌ల్పించే పారిశ్రామిక వేత్తలుగా మార్చ‌డ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఈ ప‌థ‌కంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రు. 3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని… దీనికి PMFME పథకం కింద లభించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతుంద‌ని మంత్రి తెలిపారు. ఈ ప‌థ‌కంలో మ‌హిళ‌లు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని.. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను District Resource Organisations (DROs)గా పరిగణించి, వారి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం జరుగుతుంద‌న్నారు. ఈ ప‌థ‌కంలో ఎంపికైన మ‌హిళ‌ల‌కు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌పున క‌ల్పిస్తామ‌ని మంత్రి తెలిపారు. మహిళలకు కేవలం రుణం ఇవ్వడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతం అయ్యే వ‌ర‌కు ప్ర‌భుత్వ తోడ్పాటు ఉంటుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మ‌హిళ‌లు కూడా పారిశ్రామిక వేత్త‌లుగా త‌యారు కావ‌డంతో పాటు ప్ర‌తి కుటుంబంలోనూ ఒక పారిశ్రామిక వేత్త‌ను త‌యారు చేయ‌డ‌మే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యం అని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వ‌యం అభివృద్దితో పాటు ప‌లువురికి ఉపాధి క‌ల్పించే పారిశ్రామిక వేత్త‌లుగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *