విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్‌లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో గత 35 ఏళ్లుగా ఏటా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఈసారి కూడా సేవా కార్యక్రమాలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు ఇతర విద్యా సామగ్రితో కూడిన కిట్లను అందజేశారు. చిరంజీవి నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ స్ఫూర్తితో అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జనసేన నాయకులు మహాదే అబ్బాజీ, ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, పోతున బేస్ కంటేశ్వరుడు, అత్తులూరు పెద్దబాబు, మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతూనే చిరంజీవి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. నేటి యువత కొత్తతరం హీరోలకు కూడా ఆయన ఆదర్శప్రాయుడని ఆయన స్ఫూర్తితో అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువ కావడం అభినందనీయమని అన్నారు.
మధుమస్తాన్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని తమ అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
Prajavartha Online Telugu News