-బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు పిలుపు
-బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటి గా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని. అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. బ్రిక్స్ యువజన, క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అధికారిక విందు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్‌లకు విశాఖలో సీఎం సాదర స్వాగతం పలికారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరుందని..భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని సీఎం అభివర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా రెండో ఏడాది విశాఖ దేశంలోనే నంబర్‌వన్ సిటీ ఆన్ ద రైజ్‌గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్‌వేగా, టెక్నాలజీ-ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీరప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
క్రీడలతో ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక ప్రగతి
సాంకేతికత ఆధారిత జీవన విధానంలో యువతలో ఒత్తిడి పెరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఒత్తిడిని అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి క్రీడలు, యోగా, ధ్యానం దోహదపడతాయని చెప్పారు. రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. చురుకైన జీవన విధానం ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, క్రమశిక్షణతో కూడిన జీవితానికి దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతో ఆరోగ్యకరమైన సమాజం, ఓ బలమైన ఉత్పాదక శక్తి కలిగిన దేశం నిర్మితం అవుతుందన్నారు. క్రీడల ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు, ఈవెంట్ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు, అంతర్జాతీయ ఈవెంట్ల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందన్నారు. క్రీడలు ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థలను, శక్తివంతమైన దేశాలను నిర్మిస్తాయని పేర్కొన్నారు. అపెక్స్ 2036 ద్వారా గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రతిభను గుర్తించి శాస్త్రీయ శిక్షణ ద్వారా 2036 ఒలింపిక్స్ తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధం చేస్తామని అన్నారు. 28 జిల్లాల్లో 56 రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి అకాడెమీలు, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ లతో వాటిని అనుసంధానిస్తామన్నారు.
అమరావతి స్పోర్ట్స్ సిటీ.. నెల్లూరులో క్రీడా తయారీ హబ్
అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం వివరించారు. నెల్లూరు లో క్రీడా ఉపకరణాల తయారీ, అపారెల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. విశాఖను అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీలో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్ర ఎకో సిస్టమ్ ను రూపొందిస్తామన్నారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని కలసి నేర్చుకోడానికి సహకరించడానికి దీర్ఘ కాలిక భాగస్వామ్యాలకు ఏపీ సిద్దంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్ లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్ లు, పారిశ్రామిక వేత్తలను అనుసంధానించాలని అన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజం లో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయటమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News