Breaking News

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం
-అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

మాడుగుల, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి… గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటి స్థాయి నుంచి కాలనీ, గ్రామ స్థాయి వరకు పర్యావరణహిత విధానాలను అమలు చేస్తూ.. క్రమంగా గ్రామాలను నెట్‌జీరో కమ్యూనిటీలుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నెట్‌జీరో కార్యక్రమాలను పరిశీలించారు. నెట్‌జీరో గ్రామంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధిస్తున్న లక్ష్యాలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్‌ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ, మురుగునీటి నిర్వహణ వంటి చర్యల ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

వంటింటి వ్యర్థాలే సేంద్రియ ఎరువులు

నెట్‌జీరో కార్యక్రమాలను అమలు చేస్తున్న జె. మహేశ్వరరావు నివాసాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. మహేశ్వరరావు, ఆయన సతీమణి ఇంట్లో చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటి నుంచి వెలువడే తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్టింగ్‌ గుంతల్లో వేస్తూ.. అక్కడికక్కడే సేంద్రియ ఎరువుగా మార్చుతున్న విధానాన్ని సీఎంకు చూపించారు. ఇలా ఇంట వండే తడి వ్యర్థాలను ఎరువుగా మార్చడం వల్ల ఎరువుల కొనుగోలు ఖర్చు తగ్గుదలతో పాటు వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే శ్రమ కూడా తగ్గుతుందని వివరించారు. వ్యర్థాన్ని సమస్యగా కాకుండా వనరుగా మార్చే ఈ విధానం గ్రామాల్లో విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మురుగునీటికి ఇంటి వద్దే పరిష్కారం

ఇంటి నుంచి వెలువడే మురుగునీటిని రోడ్లపైకి వదలకుండా నిర్దేశిత గుంతల్లోకి మళ్లించే ఇన్‌సిటు వేస్ట్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని కూడా సీఎం పరిశీలించారు. దీంతో కాలనీ రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండకుండా చూడటంతో పాటు దోమలు, ఈగల వృద్ధిని నియంత్రించవచ్చని లబ్ధిదారు వివరించారు. ఈ విధానం ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పును తగ్గించడంతో పాటు కుటుంబాలకు, చుట్టుపక్కల ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేలా ఇంట్లో ఏర్పాటు చేసిన ఇండక్షన్‌ స్టవ్‌ పనితీరును కూడా లబ్ధిదారు ముఖ్యమంత్రికి వివరించారు. దీపం పథకం కింద ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తున్నప్పటికీ.. ఇండక్షన్‌ స్టవ్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించడం ద్వారా గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఇండక్షన్‌తో వంట వేగంగా, పరిశుభ్రంగా ఉండటంతో పాటు గ్యాస్‌ సిలిండర్ల వినియోగం తగ్గుతుందని వివరించారు. అనంతరం ఇంటిపై ఏర్పాటు చేసిన 3 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ను సీఎం పరిశీలించారు. సౌర విద్యుత్‌తోనే ఇండక్షన్‌ స్టవ్‌ను వినియోగించడం ద్వారా అదనపు విద్యుత్‌ వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చని లబ్ధిదారులు తెలిపారు. అనంతరం లబ్ధిదారు కుటుంబంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సెల్ఫీ దిగారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ వేదికగా బ్రిక్స్ కొత్త క్రీడా బంధం ఆవిష్కరిద్దాం

-బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు పిలుపు -బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *