-పరిశ్రమలు, ఫార్మా కేంద్రాలు, పెట్టుబడులతో నాలెడ్జ్ ఎకానమీ
-డేటా సెంటర్లపై కొందరు తప్పుడు ప్రచారం
-ప్రారంభంకాకుండానే నీళ్లు ఇంకిపోతున్నాయని అపోహలు సృష్టి
-ప్రతిగ్రామం జీరో వేస్ట్ గ్రామంగా మారాలి
-మన ఊరు–మన బాధ్యతతో స్వచ్ఛాంధ్ర సాధిద్దాం
-గ్రూప్-1లో అక్రమాలతో ఏపీపీఎస్సీపై నమ్మకాన్ని దెబ్బతీశారు
-గత పాలకుల తప్పిదాలను సరిదిద్దేందుకే మూడేళ్ల సమయం
-అలమండ కోడూరు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు
మాడుగుల, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్రను పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని… అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్-1 జిల్లాగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాదని, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం తదితర పరిశ్రమలకు కేంద్రంగా మారుతోందని చెప్పారు. అనకాపల్లిని అన్ని కంపెనీలకు కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలమండ కోడూరులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ అలమండ కోడూరుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన గ్రీన్ అంబాసిడర్లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనకాపల్లి జిల్లా ఎన్డీఏకు కంచుకోటగా నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో అనకాపల్లికి పెట్టుబడులు రాకపోవడంతో జిల్లా వెనుకబడిపోతుందని చాలామంది ఆందోళన చెందారని, ఇప్పుడు విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ సిటీ నిర్మాణం జరుగుతోందని, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం తదితర పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా ఏఎస్ఆర్ విమానాశ్రయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నామని సీఎం చెప్పారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు రెక్కలు తొడుగుతుందని అన్నారు. ఏఐ, డేటా సెంటర్ల గురించి చిన్నారులు సైతం మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. దేశంలో తొలిసారిగా క్వాంటం కంప్యూటింగ్‌ను రాష్ట్రానికి తీసుకురావడం గర్వకారణమని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఈ ప్రాంత యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి సమన్వయంతో అనకాపల్లిని భవిష్యత్తులో రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
డేటా సెంటర్లకు పోలవరం నీళ్లు
డేటా సెంటర్లపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. డేటా సెంటర్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాకముందే నీళ్లు ఇంకిపోతాయని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఒక డేటా సెంటర్ ప్రారంభిస్తే ఐదు డేటా సెంటర్ల స్థాయికి ప్రాజెక్టులు వచ్చాయని, ఐదు గిగావాట్ల సామర్థ్యం ఇక్కడికి వస్తే లక్షలాది మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్ని డేటా సెంటర్లకు కలిపి 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని తెలిపారు. పోలవరం నుంచి వచ్చే నీటితో అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువును నింపుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లికి గోదావరి నీటిని తీసుకువస్తామని సీఎం ప్రకటించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నెల మొదటివారంలో అనకాపల్లికి నీరు పారిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రిజర్వాయర్ పనులను రూ.29 కోట్లతో చేపడతామని, రైవాడ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 30 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల31న ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు. రెండేళ్లలో రాష్ట్రంలో రూ.2,250 కోట్లను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు రావడం మాత్రమే కాదని సీఎం అన్నారు. పరిశుభ్రమైన ప్రాంతాలు, స్వచ్ఛమైన పర్యావరణం కూడా అభివృద్ధిలో భాగమేనని చెప్పారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛత, సమాజహితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, రోడ్లు, పరిసరాలు అన్నీ మనవే అన్న భావనతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ధర్మ కోనేరు పునరుద్ధరణ చేపట్టడాన్ని అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను సీఎం అభినందించారు. మన ఊరు–మన బాధ్యత సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్.. ప్రతి ప్రదేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన పర్యావరణం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని, ఉత్పత్తి అయ్యే ప్రతి వ్యర్థాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 143 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను డిస్పోజ్ చేశామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చెత్తను గుట్టలు గుట్టలుగా పోగేశారని, వర్షాల సమయంలో ఆ చెత్త వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్నారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తామని చెప్పినప్పుడు ఆశ్చర్యంగా చూశారని, ఇప్పుడు చెత్త నుంచి గ్యాస్, ఎరువులు తయారు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాల్లో వ్యర్థాలను సేకరించి, వాటికి ప్రతిఫలంగా నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్వయం పేరుతో డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండింతల సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. గత పాలకులు సంక్షేమం పేరుతో రోడ్లను పట్టించుకోలేదని విమర్శించిన ఆయన, తమ ప్రభుత్వం రోడ్ల రూపురేఖలు మార్చిందని ముఖ్యమంత్రి చెప్పారు.
రాజకీయాల్లో చెత్తనూ తొలగించాలి…
ప్రజలు రాజకీయ చెత్తను కూడా కడిగేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రజలు మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించినప్పుడే రాజకీయ నాయకులు కూడా తప్పులు చేయకుండా ఉంటారని చెప్పారు. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లోనూ ప్రక్షాళన అవసరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి–చెడును విశ్లేషించి మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 2019–24 మధ్య ఐదేళ్లలో గత ప్రభుత్వం విధ్వంసం, నేరాలనే నమ్ముకుందని సీఎం విమర్శించారు. నకిలీ, కల్తీ మద్యం కారణంగా 30 వేల మంది అనారోగ్యంతో చనిపోయారని ఆరోపించారు. ఇష్టానుసారంగా కల్తీ మద్యం వ్యవహారాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో నచ్చని వారి భూములను 22ఏలో పెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రతి నెలా 9వ తేదీన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కింద రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను సరిదిద్దేందుకే తమకు మూడేళ్ల సమయం పడుతోందని సీఎం అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత పాలకులు వ్యవహరించారని ముఖ్యమంత్రి విమర్శించారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 300కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయని సీఎం తెలిపారు. వాటన్నింటినీ ఎదుర్కొని ఉద్యోగ నియామకాలు చేపడితే, ఏడాది తర్వాత డీఎస్సీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా గతంలో వ్యవహరించారన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యమిస్తూ… వారిని ప్రొత్సహించేలా ప్రభుత్వం పని చేస్తుంటే… క్రీడా కోటాలో ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం సరికాదన్నారు. డీఎస్సీలో ఒక్క శాతం కూడా అవినీతి జరగలేదని, జరగనివ్వబోమని స్పష్టం చేశారు. గ్రూప్-1 సర్వీసు పరీక్షల మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని సీఎం ఆరోపించారు. ఇష్టానుసారంగా పేపర్లు దిద్దడంతో అర్హులైన అభ్యర్థుల భవిష్యత్తు అంధకారమైందన్నారు. ప్లంబర్లు, ఇంటి పనివారు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లతో గ్రూప్-1 సర్వీసు పేపర్లు దిద్దించారని ఆరోపించారు. ఆ వాస్తవాలు వెలుగులోకి వస్తున్న సమయంలో డీఎస్సీపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
అసమానతలు తగ్గాలి…పేదరికం పోవాలి
ఆర్థిక అసమానతలు తగ్గి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అభివృద్ధికి అసలైన బెంచ్‌మార్క్ అని చెప్పారు. దీపం–2.0 ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన మొత్తాన్ని నాలుగు నెలలకు ఒకసారి ఆడబిడ్డల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చెప్పారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రపంచాన్ని జయించే విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి మన ఉపాధ్యాయులకు ఉందని చెప్పారు. 2047 నాటికి భారత్ అగ్రదేశంగా, వికసిత్ భారత్‌గా అవతరిస్తుందని సీఎం అన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా 2047 నాటికి అధిక తలసరి ఆదాయంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, చింతకాయల విజయ్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సహా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News