– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-జనహిత సదనములో పండుగలా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, అక్కచెల్లెమ్మలు ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ అక్కచెల్లెమ్మలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి సహా వైఎస్సార్ సీపీ మహిళ కార్పొరేటర్లు, పలువురు మహిళ నేతలను ఆయన ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రగతికి మహిళలే మూల స్తంభాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలా కాకుండా అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారతను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ.. వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన దార్శనికత వల్లే చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందన్నారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహిళను హోంమంత్రిని చేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కేబినెట్లో మహిళలకు కీలక శాఖలను అప్పగించారన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు వెల్లడించారు. నగరపాలకలు, మునిసిపాలిటీలు, పంచాయతీల చైర్మన్లు, మేయర్ పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో సగభాగానికి పైగా అతివలకే ఇవ్వడం మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. అలాగే మహిళల రక్షణకోసం ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు మల్లాది విష్ణు చెప్పారు. మహిళా భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ పోలీస్ స్టేషన్ల పనితీరును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు.
సంక్షేమ పథకాల్లో 90 శాతం వాటా మహిళలదే
అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసిందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలు సహా 90 శాతం పథకాలు మహిళల పేరిటే అందించడం జరుగుతోందన్నారు. సెంట్రల్లో గత మూడున్నరేళ్లలో మహిళా సంక్షేమానికి రూ. 280.39 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు వక్తలు మహిళా సాధికారత, మహిళల గొప్పతనం గురించి కొనియాడారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న లాంటి మహిళా పక్షపాతి దేశంలోనే ఎవరూ ఉండరని తెలిపారు. రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగలుగుతున్నారని పేర్కొన్నారు. మహిళలను అన్ని రంగాలలోనూ ప్రోత్సహిస్తున్న జగనన్నకు అక్కచెల్లెమ్మలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. వైసీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా మాట్లాడుతూ.. సీఎం జగనన్న అందిస్తోన్న తోడ్పాటుతో అనేక రంగాలలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. అయినా ఇంకా చేయవలసింది ఎంతో మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, కార్పొరేటర్లు షాహినా సుల్తానా, అలంపూర్ విజయలక్ష్మి, ఇసరపు దేవీ, కొండాయిగుంట మల్లేశ్వరి, ఉమ్మడి రమాదేవి, బంకా శకుంతల, కుక్కల అనిత, మోదుగుల తిరుపతమ్మ, ఉద్ధంటి సునీత, బాలి గోవింద్, శర్వాణీ మూర్తి, కొంగితల లక్ష్మీపతి, కో ఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, ఎస్సై దుర్గాదేవీ, మహిళా నాయకులు అంగిరేకుల గొల్లభామ, తోపుల వరలక్ష్మి, మీసాల బాలనాగమ్మ, యక్కల మారుతి, త్రివేణి రెడ్డి, పూర్ణిమ, ఫాతిమా, చాందిని, బొందిలి శైలజా, నాగమణి, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News