రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి పిడింగొయ్యలోని జి.ఎస్.కె.ఎం లా కళాశాలలోని లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సందర్శించారు.లీగల్ ఎయిడ్ క్లినిక్ కార్యనిర్వాహక బృందంతో మాట్లాడిన అనంతరం “ఏ.డి.ఆర్. మరియు మీడియేషన్ ప్రక్రియల ద్వారా న్యాయ సమస్యల పరిష్కారం” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్ధులతో ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విధుల గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలలో ఏ.డి.ఆర్. మరియు మీడియేషన్ ప్రక్రియల ద్వారా రాజీ యోగ్యమైన అన్ని వివాదాలు స్నేహ పూర్వకమైన వాతావరణంలో శిక్షణ పొందిన న్యాయవాదుల సహాయంతో రాజీ మార్గంలో పరిష్కరించబడతాయని తెలియ జేశారు. దీని వల్ల ఇరు పక్షాలకు సత్వర పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఆర్ధిక, సామాజిక వెనుకబాటు కారణంగా ఎవ్వరికీ న్యాయం నిరాకరించబడరాదని భారత రాజ్యాంగంలోని 39(ఏ) అధికరణ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని, న్యాయ సేవాధికార సంస్థల చట్టం, సెక్షన్ 12 లో పేర్కొనబడినట్లుగా స్త్రీలు, పిల్లలు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వార్షిక ఆదాయం రూ.3,00,000/- లకు మించని వారు, తదితరులు ఉచిత న్యాయ సహాయం, ఉచిత న్యాయ సలహాలు పొందేందుకు అర్హులన్నారు . వివిధ నల్సా పథకాల ద్వారా అందిస్తున్న న్యాయ సేవల గురించి వివరించారు.ఈ సదస్సులో జి.ఎస్.కె.ఎం. కళాశాల ప్రిన్సిపల్ ఎస్. మధుసూధన రావు, సీనియర్ ఫ్యాకల్టీ పి.శ్రీనివస రావు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News