Breaking News

వైసీపీ నేతలు ఐదేళ్లు పీకలు కోసి.. ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం

– రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ రెడ్డిని స్వయం ప్రకటిత మేథావులు వెనకేసుకొస్తున్నారు
– మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, ఎన్.ఆర్.ఐ కోటా ప్రకటించింది జగన్ రెడ్డే
– రోజూ వేల మంది పేదలకు వైద్యం అందించే ఎయిమ్స్ పట్ల కూడా వివక్ష చూపిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
– జగన్ రెడ్డి అనే అరాచక శక్తి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ రెడ్డి అనే అరాచక శక్తిని మహాత్ముడు అనేలా చూపించేందుకు కొంత మంది స్వయం ప్రకటిత మేథావులు పడుతున్న తాపత్రయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల వైఖరిని ఖండించారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న ఐదేళ్లు బడుగు బలహీన వర్గాల ప్రజల పీకలు కోసి.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని తామే ఉద్దరించామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డున పడేశారు. అన్ని రంగాలను సర్వ నాశనం చేశాడు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో బర్డ్స్, టాటా ఇనిస్టిట్యూట్ లాంటి ఎన్నో ప్రఖ్యాత ఆస్ప్రతులు ఏర్పాటు చేశారు. చివరికి మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే.. ఆ సంస్థకు మంచినీరు కూడా ఇవ్వకుండా జగన్ రెడ్డి వేధించాడు. కూటమి అధికారంలోకి వచ్చాక కృష్ణా నది నుండి పైపులైన్ ఏర్పాటు చేసి నీరు అందించాం. ఎప్పుడో కట్టించిన ఎన్టీఆర్ యూ నివర్శిటీ పేరు మార్చుకోవడం తప్ప జగన్ రెడ్డి రాష్ట్ర వైద్య రంగంలో చేసిందేంటి?

పేదలకు నాణ్యమైన వైద్యం, పేద విద్యార్ధులకు మెరుగైన విద్య అందించే లక్ష్యంతో ప్రకటించిన పీపీపీ విధానం గురించి కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి ప్రభుత్వ సీట్లలో 50 శాతం సీట్లు ప్రైవేటుకు కేటాయించేలా నిర్ణయిస్తే.. పీపీపీ విధానంలో అధనంగా 220 సీట్లు తీసుకొచ్చి 110 సీట్లు ప్రైవేటుకు ఇచ్చేలా కూటమి నిర్ణయించింది. జగన్ రెడ్డి 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తే.. పీపీపీ విధానంలో కేంద్ర కోటా కింద 15 శాతం సీట్లు ఏపీకి వస్తున్నాయి. జగన్ రెడ్డి చెప్పిన విధానంలో మెడికల్ కాలేజీలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. కానీ పీపీపీ విధానంలో రెండేళ్లలోనే పది మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 1750 సీట్లు అధనంగా సాధించేలా సన్నాహాలు చేస్తున్నాం.

అభివృద్ధిని అడ్డుకోవడం లక్ష్యంగా జగన్ రెడ్డి అండ్ కో ఆది నుండి మెడికల్ కాలేజీల విషయంలో రాద్దాంతం చేస్తోంది. ప్రపంచం మొత్తం మెచ్చి అమలు చేస్తున్న పీపీపీ విధానాన్ని విమర్శించడంతో పాటుగా, ఎవరైనా ముందుకొస్తే ఊరుకునేది లేదని బెదిరించడం జగన్ రెడ్డి రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. ఈ రోజు మెడికల్ కాలేజీల గురించి నీతులు చెబుతున్న జగన్ రెడ్డి 107, 108, 133 జీవోల ద్వారా మేనేజ్ మెంట్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కేటాయింపు గురించి మాట్లాడరెందుకు? పీపీపీ విధానంలో రెండేళ్లలో నిర్మాణాలన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. విమర్శలు చేయడానికి జగన్ రెడ్డి సహా కుహానా మేథావులు సిగ్గుపడాలి.

కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోంది. ప్రజలకు జవాబుదారీ తనంగా ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే 16800 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. గ్రూప్1, గ్రూప్2, పోలీస్ డిపార్టుమెంట్‌లో రిక్రూట్ మెంట్ ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించాం. ప్రైవేటు రంగంలో ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు కల్పించాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యం దిశగా పయనిస్తున్నాం. రాష్ట్రం కోసం ప్రజల కోసం చేస్తున్న కృషిని చూసి ఓర్వ లేక వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు, కుట్రలకు తెరలేపుతున్నారు.

ఈ రోజు నీతులు మాట్లాడుతున్న జగన్ రెడ్డి సహా వైసీపీ బ్యాచ్ మొత్తాన్ని ప్రశ్నిస్తున్నా.. ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఏం ఉద్దరించారో సమాధానం చెప్పగలరా? అధికారంలోకి రాగానే ప్రజావేధికను కూల్చారు. అమరావతిపై విషం చిమ్మి మూడు రాజధానులంటూ దగా చేశారు. రాష్ట్రానికి జీవనాడిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎత్తు తగ్గించి సొంత రాష్ట్ర ప్రజలను దెబ్బతీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలో అభివృద్ధిని నాశనం చేశారు. పీపీఏలను రద్దు చేసి విద్యుత్ ఛార్జీల మోత మోగించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పేదల జేబులకు చిల్లు పెట్టారు.

ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. మాస్కులు అడిగితే చంపారు. మద్యం కల్తీని నిలదీస్తే చంపారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తే చంపారు. చివరికి మీ పార్టీకి వంతపాడలేదని కూడా నడిరోడ్డుపై బడుగు బలహీన వర్గాల వారి పీకలు కోశారు. జీవో నెం.2430తో మీడియాను అణగదొక్కారు. జీవో నెం.217తో మత్స్యకారుల జీవనోపాథిని కూడా సొంత వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నించారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులేసుకుని వేల కోట్లు దోచుకున్నారు. కమిషన్ల కోసం పోర్టుల్ని అమ్మేశారు. కేసుల కోసం రైల్వే జోన్ అంశాన్ని పక్కన పెట్టారు.

మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. దాదాపు 30 వేల మంది మీ ధన దాహానికి కిడ్నీలు, లివర్ ఫెయిల్యూర్‌తో ప్రాణాలొదిలారు. ఇళ్ల పట్టాల పేరుతో దోచుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. చివరికి ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా దోచేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని మీ వద్ద సీఎస్‌గా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బయటపెట్టారు.

అధికారం కోసం ఎవర్నైనా బలిస్తారని, ఎవర్నైనా బలిచేయడానికి వెనుకాడరని బాబాయి హత్య విషయంలో మీ వ్యవహార శైలి బయటపెట్టింది. తండ్రిని చంపిన వారిని పట్టించమని వేడుకున్న సునీతపైనే తిరిగి కేసులు పెట్టి వేధించావు. ఆస్తిలో వాటా అడిగినందుకు చెల్లెలిని రోడ్డున పడేశావు. పెయిడ్ ఆర్టిస్టులతో చెల్లి పుట్టుకను కూడా ప్రశ్నించి.. తల్లిని అవమానించావు. సొంత తండ్రి కూడా జగన్ రెడ్డిని ఏపీకి రానివ్వొద్దని, బెంగళూరులోనే ఉండమన్నారని అత్యంత దగ్గరి వ్యక్తులు బయటపెట్టారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ రెడ్డిని తప్పించడానికి రెండు నెలలు నిద్రలేని రాత్రులు గడిపానని కిరణ్ కుమార్ చెప్పారు. పరిటాల రవి హత్య వెనుక జరిగిన కుట్ర మొత్తం రవీంద్ర రెడ్డి బయటపెట్టారు. ఎన్నికల్లో గెలవడం కోసం కోడికత్తి, గులకరాయి లాంటి ఎన్నో డ్రామాలాడారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. సంక్షేమం అందించాలి. సూపర్ సిక్స్ పథకాల లబ్ది ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు సహించేందుకు సిద్ధంగా లేరు. జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తి విషయంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *