– స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర దిశగా ముందడుగు వేద్దాం
– ప్రతిఒక్కరూ జీవనశైలిలో యోగాను భాగం చేసుకోవాలి
– పండగలా ఊరూవాడా యోగా శిక్షణ కార్యక్రమాలు
– జిల్లాలో అందుబాటులో 10 వేల మంది ట్రైనర్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర-2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డులో మంగళవారం ఉదయం యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. వివిధ శాఖల అధికారులు, ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశం, స్ఫూర్తిపథంతో జిల్లాలో ఊరూవాడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్టీఎస్ రోడ్డు, బెరం పార్కు తదితర ప్రాంతాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతిచోటా యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రమంతటా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయుష్, వైద్య ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని.. వీటిలో సమాజంలోని ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్‌తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పోలీస్ థీమ్ యోగా జరిగిందని తెలిపారు. జిల్లాలో దాదాపు పదివేల మంది యోగా ట్రైనర్లు ఉన్నారని.. వీరి శిక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజూ 45 నిమిషాలు యోగాను అభ్యసిస్తే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని.. 60 నుండి 70 శాతం వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్నప్రియదర్శిని, యువజన సంక్షేమ అధికారి డా. కొల్లేటి రమేష్, డీఎంహెచ్‌వో డా. జె.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News