-మూడేళ్లలో మౌలిక వసతుల కల్పనకు భారీ ప్రణాళికలు
-డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు రూ.29 వేల కోట్ల ప్రణాళిక
-మున్సిపాటీల్లో చేసే పనుల్లో ప్రజా ధనం వృదా కాకూడదు
-పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.
స్థానిక మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో హడ్కో ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కెపాసిటీ బిల్డింగ్ రెండు రోజుల వర్క్ షాపులో భాగంగా తొలి రోజు వర్క్ షాపును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ.. రాబోయే మూడేళ్లలో ప్రజల ప్రాథమిక అవసరాలైన ఐదు ప్రధాన అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management), వాడుక నీటి (Used Water) నిర్వహణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హడ్కో (HUDCO) దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అర్బన్ ఇన్వెస్ట్‌మెంట్ విండో’ వర్క్ షాపు వల్ల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి హడ్కో అందిస్తున్న సాంకేతిక, ఆర్థిక మార్గదర్శకాలు ఎంతో దోహదపడతాయన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ అందించేందుకు రూ.17,394 కోట్ల అంచనాతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమృత్ 1.0, అమృత్ 2.0, UIDF, AIIB పథకాల ద్వారా ఇప్పటికే రూ.12,395 కోట్ల విలువైన పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కచ్చా డ్రైన్లను శాశ్వత డ్రైన్లుగా మార్చేందుకు దాదాపు రూ. 29,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. జనసాంద్రత ఆధారంగా హై, మీడియం, లో డెన్సిటీ ప్రాంతాలుగా విభజించి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో హై, మీడియం డెన్సిటీ ప్రాంతాల్లో డ్రైనేజీ పనులను రూ. 9,000 కోట్లతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన అర్బన్ క్లియరెన్స్ ఫండ్ (UCF) లో రాష్ట్రానికి లభించే రూ. 3,600 కోట్లతో పాటు, రాష్ట్ర వాటాగా రూ. 10,800 కోట్లను హడ్కో మరియు ఇతర బ్యాంకుల ద్వారా సమీకరించేందుకు 72 మున్సిపాలిటీలకు రీపేమెంట్ సామర్థ్యం ఉందన్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లో రూ. 5,000 కోట్ల విలువైన పనులను ‘యాన్యుటీ మోడల్’ ద్వారా చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతి లభించినట్లు వెల్లడించారు.
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అవసరం లేకుండా మంచి రోడ్లు, డ్రైన్లను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని ఇంజనీర్లు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. నిజంగా అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు పట్టణాల్లోని డ్రైన్లలో పూడికతీత (సిల్ట్ క్లియరెన్స్) పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఈ నెలలోనే కేంద్రం నుంచి రూ. 3,600 కోట్ల నిధులు రానున్న నేపథ్యంలో, రాబోయే మూడు నెలల్లో అన్ని డీపీఆర్‌లు (DPRs) సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు.
హడ్కో (HUDCO) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుల శ్రేష్ట మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ సగటు కంటే వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటుతో దూసుకుపోతోందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు రాకముందే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రణాళికలు, ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి అవగాహన ఉండటం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ వ్వవహారాల శాఖ మంత్రి నారాయణ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం ఈ నిధులను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు. హడ్కో కేవలం రుణాలందించే సంస్థ మాత్రమే కాదని, ప్రాజెక్టుల గుర్తింపు, రూపకల్పన నుండి పీపీపీ (PPP) భాగస్వామ్యాల పర్యవేక్షణ వరకు ప్రతి దశలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ఒక నమ్మకమైన అభివృద్ధి భాగస్వామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, వ్యవసాయం, ఆక్వా రంగాల బలాలను వాడుకుంటూనే.. భవిష్యత్తు అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ వ్యాలీ, డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలలో ప్రాజెక్టులు చేపట్టాలని పట్టణ స్థానిక సంస్థలకు (ULBs) పిలుపునిచ్చామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 25% గ్రాంట్ అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
అమరావతి నగరం రూపుదిద్దుకుంటున్న తీరును అభినందిస్తూ.. నిరంతరం శ్రమిస్తూ, వాణిజ్య విలువలను, నిబంధనలను బ్యాలెన్స్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రాష్ట్రాన్ని సుస్థిర ప్రగతి వైపు నడిపిస్తున్నారని హడ్కో (HUDCO) మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుల శ్రేష్ట కొనియాడారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల వేగవంత అభివృద్ధికి మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావాలని, అందుకోసం ప్రణాళికాబద్ధమైన ‘బ్యాంకబుల్ ప్రాజెక్టుల’ (Bankable Projects) రూపకల్పన అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ జనాభా 45-50% కి చేరిందని, ఇంతటి భారీ జనాభాకు తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలంటే మున్సిపాలిటీల సొంత ఆదాయం సరిపోదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (25% గ్రాంట్) పొందాలన్నా, మిగిలిన నిధులను మార్కెట్ లేదా బ్యాంకుల నుండి సేకరించాల్సి ఉంటుందని, అందుకే ఆర్థిక సంస్థలు నమ్మేలా డీపీఆర్ (DPR) లు తయారు చేయడంపై అధికారులు పట్టు సాధించాలన్నారు.
మున్సిపాలిటీలను లేదా మున్సిపల్ సేవలను ప్రైవేట్ పరం చేస్తూన్నారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ శాఖలో రూ. 15,800 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను (అమృత్, స్వచ్ఛ భారత్, UIDF కింద ఆగిపోయిన పాత పనులతో కలిపి) పునరుద్ధరించి, వేగంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ప్రతి ఇంటికీ తాగునీరు, డ్రైనేజీ వంటి వసతులు నూరు శాతం (100% )కల్పన, నిధుల సేకరణకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ పేర్కొన్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వ గ్రాంట్లపైనే కాకుండా సొంత ఆదాయ వనరులపై పట్టణ స్థానిక సంస్థలు (ULBs) దృష్టి పెట్టాలన్నారు. పట్టణ స్థానిక సంస్థలు (ULBs) కేవలం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడకుండా ప్రాజెక్టుల ద్వారా స్వయంగా ఆదాయాన్ని సమకూర్చుకునే కొత్త ఫైనాన్సింగ్ విధానంలోకి మారాల్సిన అవసరం ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ పి. సంపత్ కుమార్ స్పష్టం చేశారు.
తొలిరోజు వర్క్ షాపులో పైప్ లైన్ ఆఫ్ బ్యాంకుబుల్ ప్రాజెక్ట్స్, ఫ్యాక్టర్స్, ఇంఫాక్టింగ్ ప్రాజెక్ట్స్, బ్యాంక్ బుల్టీ ఎలాంగ్ విత్ కేస్ స్టడీ, ప్రాజెక్ట్ ఫార్స్ లేషన్ అండ్ డీపీఆర్ ప్రిపరేషన్ ఎలాంగ్ విత్ ప్రాజెక్ట్ రెవెన్యూ ప్రొజెక్షన్.. బెస్ట్ ప్రాక్టీసెస్, ప్రాజెక్ట్ రెవెన్యూ, బడ్జెట్ ఎక్స్ పెండిచర్, డెట్ (Debt) మేనేమేనేజ్ మెంట్ తదితర అంశాలపై హడ్కో అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రెండో రోజు వర్క్ షాపులో మున్సిపల్ బాండ్స్ పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు.
వర్క్ షాప్ లో పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఎమ్. ప్రభాకరరావు, సీఈ ఏ. సుధాకర్ రావు, కార్తీక్, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు, ఫైనాన్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News