Breaking News

చెక్కకు ప్రాణం పోసే చేతికి చేయూత

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్ధం
-మొదటి విడత ఆరు క్లస్టర్ల పరిధిలో ఏర్పాటుకు సన్నాహాలు
-తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ
-రాజమహేంద్రవరంలో వెదురు, తిరుపతిలో ఎర్రచందనం, కాపవరంలో టేకు వుడ్ బ్యాంకులు
-కలప నిల్వ చేసేందుకు గోదాములు సిద్ధం చేస్తున్న అటవీశాఖ
-కళాకారులకు సరిపడ కలప నిల్వల సమీకరణ
-లాభాపేక్ష లేకుండా కళాకారులకు కలప సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలు
-అటవీ సంరక్షణ – జీవనోపాధి భద్రత మధ్య సమతుల్యతకు చర్యలు
-సంప్రదాయ కళాకారులకు నాణ్యమైన కలప నిరంతర సరఫరాకు ప్రణాళికలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అటవీ సంరక్షణకు ప్రాధాన్యమిస్తూనే సంప్రదాయ హస్తకళాకారుల జీవనోపాధికి భద్రత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వుడ్ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. మొదటి విడతగా ఆరు క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. వుడ్ బ్యాంకుల కోసం గోదాముల గుర్తింపు, కలప సేకరణ ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి ప్రాంతాల్లో చెక్కలపై శిల్పాలు చెక్కే కళాకారుల కోసం ఈ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం సమీపంలో సామిల్ వద్ద వీటన్నింటికీ అనుసంధానంగా ఒక సెంట్రల్ వుడ్ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు కలప నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములకు తుది మెరుగులు దిద్దుతూనే, మరోవైపు కళాకారులకు అవసరమైన కలపను అటవీశాఖ సేకరిస్తోంది. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటు ప్రణాళికల్లో పురోగతిపై  పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వుడ్ బ్యాంకులు, కలప నిల్వల వివరాలను అధికారులు ఉప ముఖ్యమంత్రికు వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్‌ను వుడ్ బ్యాంకుగా మార్చారు. కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమైన తెల్లపొనికి సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. కళాకారులకు ఇబ్బంది కలగకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు తెల్లపొనికికి ప్రత్యామ్నాయంగా మృదువుగా ఉండే కలప జాతులను అధికారులు గుర్తించారు. ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులకు తక్షణ సేవలు అందించేందుకు వీలుగా ఒక ప్రైవేట్ వాణిజ్య భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 1.5 ఘనపు మీటర్ల (1.5 CMT) అంకుడు కర్రను కొయ్యబొమ్మల కళాకారులకు విక్రయించేందుకు సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా, శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్ సొసైటీకి చెందిన కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుగా గుర్తించారు. ఇక్కడ కళాకారుల కోసం ఇప్పటికే 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల నాన్-టేకు కలప సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా, మాధవమాల చెక్క బొమ్మల కళాకారుల కోసం పాత ఎర్రచందనం డిపోను వుడ్ బ్యాంకుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీరికి సాంప్రదాయ చెక్కతో పాటు ఎర్రచందనం చెక్కను కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీరి కోసం 14.158 ఘనపు మీటర్ల నారియేపి, 8.495 ఘనపు మీటర్ల ఆకేసియా కటేచు కలపను సేకరించారు. ఉదయగిరి కళాకారుల కోసం ప్రస్తుత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్స్‌ను వుడ్ బ్యాంకుగా మార్చారు. బొబ్బిలి వీణల కళాకారులకు మద్దతుగా వుడ్ బ్యాంకు ఏర్పాటుకు గొల్లపల్లి క్రాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను గుర్తించారు. వీరి కోసం 15.66 ఘనపు మీటర్ల పనస, రోజ్‌వుడ్ కలప సిద్ధంగా ఉన్నట్టు అటవీ అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదులు బొంగులతో పాటు రోజ్ వుడ్, టేకు అందుబాటులో ఉంటాయి. ఎడ్ల బండ్ల తయారీకి ఖ్యాతిగాంచిన ఏలూరు జిల్లా, కాపవరంలో టేకుతో పాటు ఇతర కలప వుడ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మన సాంప్రదాయ వారసత్వ కళలకు ప్రాణం పోసేందుకు, కళాకారులకు అండగా నిలిచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాం. అటవీ వనరుల సుస్థిర వినియోగం, శాస్త్రీయ నిర్వహణ, అక్రమ కలప సేకరణ నివారణ, కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన కలప జాతుల పునరుత్పత్తి, తోటల అభివృద్ధితో పాటు కళాకారులకు నిరంతర కలప సరఫరా తదితర లక్ష్యాల సాధనకు ఈ వుడ్ బ్యాంకులు ఉపయోగపడతాయి. కళాకారులకు అవసరమైన నాణ్యమైన చెక్కను తక్కువ ధరకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లాభాపేక్ష లేకుండా కేవలం కలప సేకరణ, రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే కళాకారుల నుంచి వసూలు చేసేలా ధర నిర్ణయం ఉండాలి. ముడి సరుకు దొరకక ఇబ్బందిపడుతున్న హస్తకళాకారులకు వుడ్ బ్యాంకులు ఒక వరం కావాలి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం చెక్కను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గి, కళాకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా భవిష్యత్ తరాలు సంప్రదాయ కళవైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. సాంప్రదాయ బొమ్మల తయారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.
• అత్యంత పారదర్శకంగా వుడ్ బ్యాంకుల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమైన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండాలి. వుడ్ బ్యాంకుల నిర్వహణలో లోపాలకు తావుండకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాలు అంచనా వేసి, అందుబాటులో ఉన్న కలప వనరులను శాస్త్రీయ పద్ధతుల్లో మ్యాపింగ్ చేయాలి. లభ్యత తక్కువగా ఉండే అంకుడు, తెల్లపొణికి చెట్లను ప్రత్యేకంగా అటవీశాఖ నర్సరీల్లో పెంచేందుకు ఏర్పాట్లు చేయాలి. చట్టబద్ధంగా లభ్యమయ్యే కలప సేకరణ, నిల్వ, ప్రీ-ప్రాసెసింగ్ సదుపాయాల ఏర్పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నర్సరీలు, తోటల అభివృద్ధి వంటి చర్యల ద్వారా మన కళకు ప్రాణం పోసిన వారమవుతామ”న్నారు.
• క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులన్నీ ఏకరీతి నమూనాతో ఏర్పాటు చేయాలి
హస్తకళాకారుల కోసం అటవీశాఖ ఏర్పాటు చేస్తున్న క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల నిర్మాణం, నిర్వహణ, డిజైన్ వ్యవహారంలో ఒక విధమైన నమూనా పాటించాలని పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావుకు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు. నామఫలకాలు, లాగ్ రిజిస్టర్లు సారూప్యత కలిగి ఉండాలని, వుడ్ బ్యాంకులపై ఆ క్లస్టర్ పరిధిలోని కళారూపాలు ప్రతిబింబించాలని సూచనలు చేశారు. సాధ్యమైనంత వేగంగా వుడ్ బ్యాంకులను కళాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *