-దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి
-యూరియా వినియోగం తగ్గించినా… ఆక్వా ఉత్పత్తి పెంచినా దేశాభివృద్ధికి సహకరించినట్టే
-కలిదిండి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ జెండాతో పాటు ప్రతి ఒక్కరి మనసులో దేశాభివృద్ధి కోసం అను నేను అనే అజెండాతో ఒక సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక చేతిలో జాతీయ జెండా.. మరో చేతిలో ‘నేను.. దేశం కోసం ఇది చేస్తాను’ అనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు సంకల్పం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి.. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించేలా తాను పని చేస్తానని సంకల్పం తీసుకున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దేశ సేవ అంటే సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయడం ఒక్కటే కాదని.. ఎవరి వృత్తిలో వారు అత్యుత్తమంగా పనిచేయడం కూడా దేశ సేవేనని స్పష్టం చేశారు. రైతు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తే అది దేశ సేవేనని.. ఆక్వా రైతు నాణ్యమైన ఉత్పత్తిని సాధించి ఎగుమతులు పెంచితే అదీ దేశ సేవేనని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే ఓ విద్యార్థి బాగా చదివి ఉన్నతంగా ఎదగడం.. వ్యాపారి నాణ్యమైన ఉత్పత్తులు అందించి ఉపాధి కల్పించడం.. ఇలా ప్రతి ఒక్కరూ తమకు తాము ఒక సంకల్పం తీసుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గిరిజన గ్రామంలో పుట్టిన ద్రౌపదీ ముర్ము దేశ అత్యున్నత పదవిని ‘అను నేను’ అంటూ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారని సీఎం గుర్తుచేశారు. సాధించాలనే సంకల్పం ఉంటే ఎవరైనా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పారు. ‘చంద్రబాబు నాయుడు అనే నేను.. స్వర్ణాంధ్ర నిర్మాణానికి సంకల్పం చేశాను’ అని పేర్కొన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు కూడా తమ వంతుగా ఏయే అంశాలపై సంకల్పం తీసుకోవాలో ఆలోచించాలని కోరారు. ప్రతి ఒక్కరి సంకల్పానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ సంక్షేమంతో పాటు రాష్ట్రం, దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రజలు తమ సంకల్పాలను నిర్దేశించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంగా కాకుండా.. ప్రతి ఒక్కరూ దేశం కోసం తాను చేయాల్సిన పనిని నిర్ణయించుకునే రోజుగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News