-వచ్చే 7 నెలల్లో 68.64 లక్షల పాస్ పుస్తకాల జారీ
-ఈ నెల వరకూ 32.22 లక్షల పుస్తకాలు రైతులకు అప్పగింత
-పట్టాదారు పాస్ పుస్తకాలకు టెక్నాలజీ రక్షణ కవచం
-పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ
-డీఎస్సీపై టీచర్లు తిరగబడినా గొడ్డలి పార్టీకి బుద్దిరాలేదు
-రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు తామే కట్టానని కలలు కంటున్నారు
-కలిదిండిలో మీ భూమి- మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూమి రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ రికార్డుల రిఫార్మ్స్ 2026 తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే అజెండాగా కూటమి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. 2027 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తామని తెలిపారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మీ భూమి- మీ హక్కు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం నల్లజర్ల దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని సీఎం జారీ చేశారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి కలిదిండిలో నిర్వహించిన గ్రామసభకు హాజరైనట్టుగా సీఎం రిజిస్టర్‌లో సంతకం చేశారు. అనంతరం ప్రజలు, రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ వేగంతో అభివృద్ధి చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఇచ్చిన భూమిని 22ఏలో పెడితే దానిని పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చాం. మీ భూమి మీ హక్కు దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీల్లేదు. పాస్ పుస్తకాలపై గత పాలకులు ఫోటోలు ఎలా వేసుకుంటారు. 2019-24 మధ్య గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా రెవెన్యూ రికార్డులు ధ్వంసం అయ్యాయి. వారికి ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని, ఆస్తుల్ని డిజిటల్ గా 22ఏలో పెట్టేసి వివాదాస్పదం చేశారు. 2024లో అధికారంలోకి రాగానే ఎక్కడికి వెళ్లినా భారీ ఎత్తున భూ ఫిర్యాదులు అందాయి. అప్పుడే వీటన్నిటినీ పరిష్కరించాలని నిశ్చయించుకున్నాం. ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తున్నాం. సమస్యలు పట్టించుకోని వారికి ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. గత పాలకులు బటన్ నొక్కటం, పరదాల చాటున రావటం, సభలు పెట్టి చెట్లు నరికేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ప్రతీ నెలా సమావేశాల ద్వారా వారిని కలుస్తున్నాం. కరెన్సీకి ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టా దారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నాం. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించాం. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేశాం. 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకూ రైతులకు, భూ యజమానులకు అందించాం. వచ్చే ఏడు నెలల్లో 9365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేస్తాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రెవెన్యూ సంస్కరణలతో రైతులకు ప్రయోజనాలు
“ఇప్పటి వరకూ 41 వేల ఎకరాల మేర భూ సమస్యలు క్లియర్ చేశాం. దీని ద్వారా 1.27 లక్షల మందికి పైగా రైతులు, పరిశ్రమలు, ప్రజలకు ప్రయోజన కలిగింది. 1.36 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశాం. ప్రతీ రైతుకు, భూ యజమానికి రాజ ముద్రతో కూడిన పట్టా దారు పాస్ పుస్తకాలు జారీ చేసే వరకూ విశ్రమించం. భూమి తమదైనా వేర్వేరు ఇబ్బందులతో రైతులు, భూ యజమానులు ఇప్పటి వరకూ సమస్యలు ఎదుర్కొన్నారు.1బీ, అడంగల్, డీకేటీ, ఏఆర్సీ, ఇనామ్, సీలింగ్ లాంటి పాత భూమి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టాం. లింక్ డాక్యుమెంట్లన్నీ ఆన్ లైన్ ద్వారా అందిస్తాం. భూ రికార్డులను చట్టబద్దంగా నవీకరించి ధృవీకరించే ప్రక్రియను పకడ్బందీగా చేస్తున్నాం. 9 లక్షల మందికి ఇప్పటి వరకూ ఆటో మ్యూటేషన్ సౌకర్యం కల్పించాం. రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే చేసి ఈకేవైసీ తీసుకున్న తర్వాతే రాజముద్రతో కూడిన పట్టా దారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నాం. గ్రామ సభ నిర్వహించి పూర్తి పారదర్శకంగా పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలన్నదే మా ఉద్దేశం. వివాదాలు తగ్గి లావాదేవీలు పెరుగుతాయి. ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అనుసంధానించి ప్రజలకు సులభంగా పౌర సేవలు అందేలా చర్యలు చేపట్టాం. కొల్లేరు వద్ద తాగునీటి సమస్యను పరిష్కరించేలా రూ.36 కోట్లను కైకలూరుకు మంజూరు చేశాం. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పదేపదే మరమ్మత్తులు వచ్చే రహదారులకు కూడా శాశ్వత పరిష్కారం ఉండేలా సిమెంట్ రోడ్లు వేయాలని ఆలోచన చేస్తున్నాం. గత పాలనలో గోతులు పడిన రోడ్ల గురించి ప్రశ్ని్స్తే బటన్ నొక్కామని సమాధానం ఇచ్చేవారు. గత పాలన తాలూకు విధ్వంసపు గడ్డు రోజులను అధిగమించి క్రమంగా అభివృద్ధివైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. 2019-24 మధ్య రాష్ట్రం ఆర్ధికంగా ధ్వంసమైంది, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం లాంటి పరిస్థితులు ఆక్వా రంగాన్ని దెబ్బతీశాయి. కానీ కూటమి వచ్చాక ఆక్వాకు రూ.1.50 కు యూనిట్ చొప్పున రాయితీ విద్యుత్ ను జోన్ తో నిమిత్తం లేకుండా ఇస్తున్నాం. ప్రభుత్వానికి రూ.1150 కోట్ల అదనపు భారం పడినా.. దేశానికి ఆదాయం వచ్చేలా చేస్తున్న రైతుల కోసం దీనిని భరిస్తున్నాం. నాన్ ఆక్వా జోన్ పరిధిలోని 12,500 మంది రైతులకు కూడా కొత్తగా ఈ రాయితీ విద్యుత్ అమలు అవుతుంది.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
పరామర్శల పేరుతో గొడ్డలిపార్టీ నానాయాగీ
” ఓ దౌర్భాగ్యపు పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. గొడ్డలి పార్టీ వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. నక్సల్స్ నాపై క్లైమోర్ మైన్స్ పేల్చినా కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నాను. రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్‌లో మత విద్వేషాలను కూడా సమర్ధంగా నియంత్రించాం. ఆ తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి జరిగి సంపద పెరిగింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చాయి. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ వల్ల గంజాయి, రౌడీ బ్యాచ్ కారణంగా అరాచకాలు జరిగాయి. మేం అధికారంలోకి వస్తునే గంజాయి పంటను నిర్మూలించాం. దేవరపల్లి వద్ద పొగాకు రైతుల పరామర్శకు వెళ్లి నానా యాగీ చేశారు. స్వైర విహారం చేశారు. రోడ్లపై ప్రమాదకరంగా మోటారు సైకిళ్లతో సర్కస్ చేస్తూ భయపెడుతున్నారు. రైతుల పొగాకు మొత్తం తొక్కించారు. పొగాకు కేజీకి రూ.10 చొప్పున సబ్సీడీ ఇవ్వటంతో పాటు బ్యారెన్ కు రూ.50 వేల రుణం ఇప్పించేలా కేంద్రంతో మాట్లాడాం. తప్పు చేస్తే మా పార్టీ వ్యక్తులైనా చర్యలు తీసుకుంటున్నాం. గుంటూరులో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేతను సస్పెండ్ చేశాం. కేసు పెట్టి విచారణ చేస్తున్నాం. శ్రీకాకుళంలో ఓ మాజీ మంత్రి కొడుకు బైక్ తో గుద్ది ఓ వ్యక్తిని చంపేస్తే అతన్ని పరామర్శించడానికి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వెళ్లి అరాచకం చేశారు. ప్రధాన మంత్రి పర్యటన ఓ వైపు ఉంటే రోడ్లపై గంటలు గంటలు ర్యాలీ చేశారు. ఓ మహిళా పోలీసు అధికారిపై దాడి చేశారు. తిరిగి పోలీసులపై నెపం వేశారు. మెగా డీఎస్సీ ద్వారా 15 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తే దానిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి మెరిట్ తో ఉద్యోగాలు సంపాదించిన యువతను కించ పరిచేలా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపరు లీక్ అయితే..ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. మెగా డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన టీచర్లు రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామని వాళ్లు హెచ్చరించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్లు ఆందోళన చేశారు. ఇంత చేసినా ఆ పార్టీకి బుద్దిరావటం లేదు. ఇంకా ఆందోళన చేస్తాం, రోడ్లపై స్వైరవిహారం చేస్తామంటున్నారు. రప్పా రప్పా అంటూ గొడ్డలి పార్టీ రౌడీలు, గంజాయి బ్యాచ్ లు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కడితే అది నేనే కట్టాను అంటున్నాడు. పోలవరం పూర్తి అయితే అది కూడా నేనే చేశానంటాడు. అమరావతి నిర్మిస్తే అది కూడా నేనే అంటాడు. అభివృద్ధి పనులు పూర్తి చేసి మేం ఆనందిస్తుంటే.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు విధ్వంసం చేసేసి ఆరోపణలు చేస్తున్నాడు. ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించినా వదిలి పెట్టేది లేదు.” అని ముఖ్యమంత్రి అన్నారు. అనంతరం రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సీఎస్ సాయి ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్ష్మి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News