Breaking News

ఆగస్టు 15న జాతీయ పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞ చేపట్టండి…

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15వ తేదీన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శాఖలన్నింటిలో జాతీయ పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన గత 12 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజానీకం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. వ్యవసాయ, విద్యా, వైద్య రంగాలు కార్పొరేట్ శక్తుల ఆధీనంలో వ్యాపార ధోరణితో నడుస్తున్నాయి. దేశంలో అవినీతి, అక్రమాలు తాండవిస్తున్నాయి. దేశ ఆర్థికవృద్ధికి ప్రతిరోజూ తమ వంతు కృషి చేస్తూ, నిజమైన సంపదను సృష్టిస్తున్న కార్మికులు నిరంతరం అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నారు. స్థిరమైన ఉపాధి అనేది రోజురోజుకూ తగ్గిపోతోంది. కార్పొరేట్ ప్రయోజనాలకు మునుపెన్నడూ లేని విధంగా ప్రోత్సాహం లభిస్తుండగా, కార్మిక హక్కులు మాత్రం హరించబడుతున్నాయి. మహిళా సాధికారత గురించి పదేపదే పాలకులు హామీలు గుప్పిస్తున్న పాలకులు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును డీలిమిటేషన్‌తో ముడిపెడుతున్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, దారిద్య్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. తాము అధికారం చేపట్టగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గత 12 ఏళ్లకు ముందు మోడీ ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. అటవీ హక్కులు హరించబడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరించేందుకు దశలవారీగా మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. దళితులు, ఆదివాసీలు నిరంతరం వివక్షను, దౌర్జన్యాలను మరియు నిర్వాసితత్వాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికితోడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పునాదియైన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలలో లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఎసఐఆర్ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓటర్లను తొలగించడమే అందుకు తార్కాణం. ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి భారతదేశానికి తక్షణమే సమగ్ర ఎన్నికల సంస్కరణలు అవసరం.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు చేయలేదు. గత 2 ఏళ్లుగా పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్ప్పున ఇళ్లస్థలాలను కేటాయించలేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందన శూన్యం. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు స్వాధీనపరచలేదు. రేషన్‌కార్డులు, పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల మంజూరులో జాప్యం కొనసాగుతోంది. పెండింగ్ ప్రాజెక్టుల పరిపూర్తికి చిత్తశుద్ధి చూపడంలేదు. నిర్వాసితుల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉన్నాయి. ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతుంటే ఏమాత్రం పట్టకుండా అటు నరేంద్రమోడీ, ఇటు చంద్రబాబు పరస్పరం పొగడ్తలతో సరిపుచ్చుకోవడం విచారకరం.
ఈ నేపథ్యంలో భారత కమÖ్యనిస్టు పార్టీ (సిపిఐ) ప్రజల పక్షాన నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ‘మార్పు కోసం’ అనే నినాదంతో భారత కమÖ్యనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమితి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రచార యాత్రలు, పాదయాత్రలు చేపట్టింది.
ఈ ప్రచార, పాదయాత్రల ముగింపురోజైన ఆగస్టు 15వ తేదీన 80 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాపితంగా అన్ని పార్టీ శాఖలలో జాతీయ పతాకావిష్కరణలు గావించి, ప్రతిజ్ఞ చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *