Breaking News

ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

-భూ యజమానులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి -భూసేకరణ అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాలు

వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ప్రతిపాదించిన ఎర్రుపాలెం – నంబూరు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామం వద్ద రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల వివరాలు, సేకరణ ప్రక్రియ పురోగతి, సంబంధిత రికార్డులను పరిశీలించిన ఆయన, భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ఎర్రుపాలెం – నంబూరు రైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి ఇప్పటికే భూ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నోటిఫికేషన్ ప్రక్రియ అనంతరం భూసేకరణకు సంబంధించిన తదుపరి చర్యలను నిబంధనల ప్రకారం వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని ఆరు గ్రామాల్లో సుమారు 175 ఎకరాలు, కంచికచర్ల మండలంలోని రెండు గ్రామాల్లో సుమారు 120 ఎకరాల భూమిని భూసేకరణ ప్రక్రియలోకి తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భూసేకరణకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి, భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రైల్వే మార్గం అమరావతితో పాటు పరిసర ప్రాంతాల రవాణా, ఆర్థిక అభివృద్ధికి కీలకంగా నిలిచే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను నిర్ణీత నిబంధనల ప్రకారం పూర్తి చేయడంతో పాటు, సంబంధిత శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జుజ్జూరు వద్ద భూసేకరణకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల వివరాలు, రెవెన్యూ రికార్డులు, సేకరణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ అంశాలను గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ గడ్డిపాటి అనిల్ కుమార్, రిటైర్డ్ ఆర్డీఓ & భూ సేకరణ అధికారి భాస్కర నాయుడు, తహసీల్దార్ పాలపర్తి రవికుమార్, ఎంపీడీఓ శేఖర్, డీటీలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *