Breaking News

సేంద్రియ వ్యవసాయంతో భూసారం పెంపొందించాలి

-అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం
-ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి
-రైతులకు కేటాయించిన కోటా మేరకు ఎరువులు అందుబాటులో ఉంటాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రం, బయో రిసోర్స్ సెంటర్, పిఎసిఎస్‌లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. పొన్నవరం గ్రామంలోని రైతు సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన “రైతన్న నీకోసం – ఎల్‌నినో ప్రభావ నివారణకు కార్యాచరణ ప్రణాళిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని తెలిపారు. ఉద్యానవన పంటల సాగులో అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. పంటల వైవిధ్యంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా చీడపీడల నుంచి పంటలను రక్షించడంతో పాటు భూసారాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణం, జీవకోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి రైతుకు వివరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీ గౌరీ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ తయారు చేస్తున్న సేంద్రియ ఉత్పత్తులను పరిశీలించి, వాటి తయారీ విధానం, రైతులు వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారు, వాటి ద్వారా లభిస్తున్న ఆదాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం పొన్నవరం పిఎసిఎస్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతుల పంట విస్తీర్ణం ఆధారంగా ఎరువులు కేటాయించడం జరుగుతుందని, కేటాయించిన కోటా మేరకు అవసరమైన సమయంలో ఎరువులను తీసుకెళ్లవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒక్కో రైతుకు కేటాయించిన కోటా ఆ రైతుకే ఉంటుందని, ఎరువుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడటం, ఎరువులు అయిపోతాయేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందే సులభమైన మార్గం అందుబాటులో ఉందన్నారు. రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పిఎసిఎస్ ఆవరణలో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో గడ్డిపాటి అనిల్ కుమార్, తహసీల్దార్ పాలపర్తి రవికుమార్, ఎంపీడీవో శేఖర్, మండల వ్యవసాయ అధికారి జోగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *