విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) విజయవాడ అర్బన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రముఖులు అంబికా కృష్ణ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఐవీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షులుగా కొల్లూరు లక్ష్మణ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. కోన శ్రీనివాస్, ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్యుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు, సమాజానికి ఎన్నో మంచిపనులు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నూతన కార్యవర్గ సభ్యులపై వాసవీ మాత, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొల్లూరు లక్ష్మణ గుప్తా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పర్యటించి ఆర్యవైశ్యుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో గల ఆర్యవైశ్య సామాజికవర్గం మొత్తాన్ని ఏక తాటిపై తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. ఆర్యవైశ్యుల్లో పేదవారిని గుర్తించి వారి విద్య, వైద్య అవసరాలకు చేయూత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News