Breaking News

ప్రగతి బాట… మారుమూల పల్లెలకు దారులు

-మరో 158 ఆవాసాలకు తొలిసారి రహదారి సౌకర్యం
-అమలులోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు
-ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 422.10 కోట్ల నిధులు మంజూరు
-347 కి.మీ పొడుగున, 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం
-నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని చిట్టచివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అడవితల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సైతం జనజీవనానికి దూరంగా విసిరేసినట్టు ఉండే మారుమూల పల్లెలు, ఆవాసాలకు, కుగ్రామాలకు రోడ్లను పరిచయం చేసేందుకు  పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మరో 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. 347 కిలోమీటర్ల పొడవున, 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి, అంచనాలు రూపొందించారు. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ. 422.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఐదేళ్లపాటు ఈ రోడ్ల నిర్వహణ నిమిత్తం మరో రూ. 24.47 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది.
ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. మారుమూల గ్రామాలకు నిర్మించే రోడ్ల నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలి. మనం వేసే రోడ్లు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి, ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయ”ని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *