-రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్
-ఆర్టీజీఎస్ నుంచి చేపట్టిన వివిధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు.. ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందిస్తే జాతి నిర్మాణానికి సహకరించినట్టే. ప్రతి ఉద్యోగి.. ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ టేకప్ చేయాలి. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగత్మకంగా చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్ వాల్వ్ అవుతారనడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనం. అలాగే వాస్తవాలను ప్రజలకు వివరించగలిగితే… ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారు. దీనికి కర్నూలులో డీఎస్సీ-2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ. నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించాం. జూలై నెలలో 10.70 శాతం వృద్ధిని నమోదు చేయగలిగాం. ఎల్ నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుంది. ఇప్పుడే అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News