-సమావేశానికి డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు హాజరు
-క్షేత్రస్థాయి నివేదికలతో సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం
-సచివాలయంలో హై లెవల్ మీటింగ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 03:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తంగా 1,300 మంది అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై ముఖ్యమంత్రి లోతైన విశ్లేషణ చేయనున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న రిపోర్టులను ఈ సమావేశంలో నేరుగా అధికారుల ముందే ముఖ్యమంత్రి బయట పెట్టనున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరు కానుండగా, జిల్లాల్లోని మిగిలిన అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు.
Prajavartha Online Telugu News