-నెల రోజుల్లో 6 లక్షలకు పైగా భక్తుల సారె సమర్పణ – గత దశాబ్ద కాలంలోనే ఆల్ టైమ్ రికార్డ్
-4 రాష్ట్రాల నుండి తరలివచ్చిన సారె బృందాలు.. తొలిసారిగా నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జులై 15 నుండి ఆగస్టు 12 వరకు కన్నులపండువగా జరిగిన ‘ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాలు’ బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసమంతా ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తజన ప్రవాహంతో, శోభాయమానమైన ఊరేగింపులతో పసిడి వర్ణ శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీని ముందస్తుగానే అంచనా వేసి ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ పర్యవేక్షణలో చేపట్టిన పకడ్బందీ ఏర్పాట్లు భక్తులందరి ప్రశంసలు అందుకున్నాయి.భక్తుల సేవలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు పాలు పంచుకున్నారు.
దశాబ్ద కాలంలోనే ఆల్ టైమ్ రికార్డ్: ఈ ఆషాఢ మాసంలో నెల రోజుల వ్యవధిలో ఏకంగా 6 లక్షలకు పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించారని దేవస్థాన యంత్రాంగం అంచనా వేసింది. గత 10 సంవత్సరాల సారె సమర్పణ చరిత్రలోనే ఇది అత్యధిక రికార్డు కావడం విశేషం. సాధారణ రోజులలో ప్రతి రోజు సగటున సుమారు 15,000 మందికి పైగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించగా.. వారంతపు సెలవు దినాలైన శుక్రవారం, శనివారం మరియు ఆదివారాల్లో ఈ సంఖ్య 85,000 దాటి భక్తజన సందోహం పోటెత్తింది. కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున సారె బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సంభారాలను నివేదించాయి. ఊళ్ళు, కాలనీలు, అపార్ట్మెంట్స్, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అధికారులు, రాజకీయ నాయకులు, చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఇంద్రకీలాద్రి కి చేరి సారె సమర్పించారు.
రద్దీని క్రమబద్ధీకరించడానికి, సారె బృందాలకు సరైన సేవలు అందించడానికి దేవస్థానం ఈ ఏడాది తొలిసారిగా ‘సారె బృందాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ’ ను నూతనంగా ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా ఏ బృందం ఎప్పుడు వస్తోందో ముందస్తుగా తెలుసుకోవడం వల్ల క్యూ లైన్ల నిర్వహణ ఎంతో సులువయింది. సారె సమర్పించడానికి వచ్చిన భక్తుల బృందాలకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించింది. సారె తెచ్చిన భక్తులకు క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా వేగవంతంగా ఉచిత సత్వర దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం పండితులచే సామూహిక వేద ఆశీర్వచనం అందజేశారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణతో పాటు ఉచిత ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా చేపట్టారు.
ఈ ఆషాఢ మాస సారె ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఎలాంటి చిన్న ఘటనకు కూడా తావులేకుండా రికార్డు స్థాయిలో విజయవంతం చేసిన వైదిక బృందానికి, వివిధ విభాగాల ఆలయ అధికారులకు, సిబ్బందికి, సహాయక పోలీసు శాఖకు, మీడియా మిత్రులకు మరియు సహకరించిన భక్తులందరికీ దేవస్థానం ఈవో శీనా నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
Prajavartha Online Telugu News