-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి
-ఈహెచ్‌ఆర్ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం
-వినియోగంపై ఎన్ ఎం సి డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షణ
-వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండియన్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ రోగులకు అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ ఆధారంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ బోధనాసుపత్రులతో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే అభా ఐడీ ఆధారంగా సేవలు అందిస్తున్నామని, దీనివల్ల రోగుల ఆరోగ్య వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (ఈహెచ్‌ఆర్) రూపొందుతున్నాయని తెలిపారు. ఎన్ఎంసీ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు వైద్య కళాశాలల్లో అభా ఐడీల ఆధారంగా వైద్య సేవలు అందించే ప్రక్రియను వెంటనే అమలు చేయాలని వీరపాండియన్ కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు.
రోగి ఆరోగ్య వివరాలు నిక్షిప్తం
రాష్ట్రంలో ఇప్పటివరకు 5.04 కోట్ల అభా ఖాతాలు సృష్టించగా, వాటికి అనుసంధానంగా 12.7 కోట్ల ఆరోగ్య రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. రోగి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్లినా సంబంధిత ఆరోగ్య వివరాలు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్లో నమోదవుతాయని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ విధానం అమలవుతోందన్నారు.
కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. ఎన్ఎంసీ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఈహెచ్‌ఆర్ విధానం పూర్తిస్థాయిలో అమలు కావాలని స్పష్టం చేశారు. ఈ EHR నమోదు చేయటంలో ప్రయివేటు కాలేజీల మధ్య పోటీతత్వం ఉండాలి అన్నారు
భవిష్యత్తు లో అత్యంత కీలకం
దేశవ్యాప్తంగా రోగులకు విస్తృత ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో అభా ఖాతాల వ్యవస్థను రూపొందిస్తున్నారని వీరపాండియన్ తెలిపారు. భవిష్యత్‌లో వైద్య కళాశాలలకు సీట్ల మంజూరు, ఇతర అనుమతుల విషయంలో అభా ఖాతాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అభా ఐడీ ఆధారంగా సేవలు, ఈహెచ్‌ఆర్ నమోదవుతున్న తీరును ఎన్ఎంసీ డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తోందని చెప్పారు.
అభా రికార్డుకు రూ.10 ప్రోత్సాహకం
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధరబాబు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌తో అనుసంధానమైన హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్)ను ప్రైవేటు వైద్య కళాశాలలు వినియోగిస్తే రోగి ఆరోగ్య వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో రోగి అనారోగ్య చరిత్రపై వైద్యులకు త్వరగా అవగాహన రావడంతో చికిత్స సులభతరమవుతుందన్నారు.
ఒక్కో ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డును నమోదు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.150 కోట్ల మేర చెల్లింపులు జరగగా, రాష్ట్రానికి సుమారు రూ.15 కోట్లు అందాయని చెప్పారు. ఇందులో ప్రైవేటు ఆసుపత్రులకు జరిగిన చెల్లింపులు రూ.75 లక్షలు మాత్రమేనన్నారు.
సాంకేతిక సహకారం అందిస్తాం
ప్రైవేటు వైద్య కళాశాలలు అభా ఐడీల ద్వారా ఈహెచ్‌ఆర్ తయారీలో చురుగ్గా పాల్గొనాలని చక్రధరబాబు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. ఏ సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్‌ను వినియోగించినా, దానికి అనుగుణంగా సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
సదస్సులో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సుధీర్, ఏబీడీఎం స్టేట్ నోడల్ అధికారి బీవీ రావు తదితరులు పాల్గొన్నారు. *ఈ కార్యశాల కోసం వైద్య ఆరోగ్య శాఖ పథకాల అమలులో సహకరిస్తున్న” PATH ” సంస్థ సాంకేతిక మద్దతును అందించింది.
Prajavartha Online Telugu News