-విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
-రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నట్టు వెల్లడి
-స్వయంగా కేంద్ర మంత్రికి ఆహ్వానం పలికిన అంశాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం రాజధాని అమరావతి వేదికగా జరగనున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల నివాస సముదాయాలు తదితర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రివర్యులను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్–2 పనుల ప్రారంభోత్సవం కూడా జరగనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు నారాయణ ని ఉప ముఖ్యమంత్రి అభినందించారు.
గురువారం విశాఖపట్నం వేదికగా ముందుగా నిర్ణయమైన జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించాలన్న తన అభ్యర్ధన మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నట్టు, తన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్ హాజరుకానున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు, ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News