Breaking News

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం

-రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
-నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
-⁠రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ – మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *