-రాష్ట్ర ప్రజలకు కోసం పనిచేసే నిత్య కార్మికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని స్థానిక స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో కార్మిక శాఖకు సంబంధించిన కనీస వేతనలా సలహా మండలి చైర్మన్ మరియు సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, వారి సంక్షేమం, కనీస వేతనాల అమలు, కార్మికులకు అందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులకు సూచనలు చేశారు.
కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కార్మికులకు మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
కనీస వేతనలా సలహా మండలి చైర్మన్, సభ్యులు క్షేత్రస్థాయిలో కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి, సంబంధిత రంగాల వారీగా వేతనాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు రూపొందించాలని మంత్రి సూచించారు. యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో కార్మికులను పూర్తిగా విస్మరిచారు. కొన్ని బోర్డులను కూడా రద్దు చేయడం జరిగింది అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని దీనిపై కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్మికుల కోసం నిత్యం ఒక కార్మికుడు లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో కష్టపడుతున్నారని ఇలాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో కనీస వేతన మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి , సభ్యులు, కార్మిక శాఖ ఉన్నతాధికారులు సెక్రటరీ ఎంవీశేషగిరిబాబు, కమిషనర్ గంధం చంద్రుడు, జేషియల్ రాణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News