Breaking News

గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ అంటే ‘అక్రమార్కులకు ఆలవాలమైన కమిషన్’:మంత్రి కందుల దుర్గేష్

-ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్ నివేదిక గత ప్రభుత్వ అరాచక పాలనకు, పాపాలకు నిలువెత్తు చెంపపెట్టు అని మంత్రి దుర్గేష్ వెల్లడి
-అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు.. మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి దుర్గేష్ హితవు
-దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డీఎస్సీపై చర్చించండి… శాసనసభ వేదికగా సమాధానం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ అంటే ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ లా కాకుండా ‘అక్రమార్కులకు ఆలవాలమైన కమిషన్’ గా మారిపోయిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల స్కామ్, కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ తదితర అంశాలపై మీడియాకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

132 పేజీల ‘సిట్’నివేదికతో గత ప్రభుత్వ అక్రమాలు బట్టబయలు:మంత్రి దుర్గేష్

ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మూడుసార్లు మూల్యాంకనం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ గత ప్రభుత్వ నాయకులు ఉద్యోగాలు అమ్ముకున్నారని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. 132 పేజీల సిట్ నివేదిక గత ప్రభుత్వ అరాచకాలకు, అవినీతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందన్నారు.కరోనా మహమ్మారిని సాకుగా చూపి నాటి ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల పరీక్షా పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా డిజిటల్ మూల్యాంకనం చేశారని.. అసలు ఈ డిజిటల్ మూల్యాంకన డ్రామాకు అనుమతి ఇచ్చింది ఎవరో జవాబు చెప్పాలని గత ప్రభుత్వ నేతలను డిమాండ్ చేశారు.డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు మొట్టికాయలు వేయడంతో మంగళగిరి దగ్గర ఉన్న ‘హాయ్ ల్యాండ్’ లో మాన్యువల్ మూల్యాంకనం అంటూ మరో డ్రామా ఆడారు. వాస్తవానికి అక్కడ మూల్యాంకన ప్రక్రియ చేసి కూడా చేయలేదని కోర్టుకు పచ్చి అబద్ధాలు చెప్పి మరోసారి న్యాయస్థానం చేతిలో మొట్టికాయలు తిన్న ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు.ముచ్చటగా మూడోసారి మాన్యువల్ మూల్యాంకనం పేరుతో చీఫ్ ఎగ్జామినర్లు జవాబుపత్రాల్లో ఇష్టానుసారం మార్కులు మార్చేయడం, దిద్దడం, అడ్డగోలుగా తమకు కావాల్సిన వారికి మార్కులు పెంచడం, మిగతా వారికి తగ్గించడం చేశారని ఫైర్ అయ్యారు. ఏపీపీఎస్సీ ఫలితాల అక్రమాలపై పూర్తిస్థాయిలో బాధితులకు న్యాయం జరగాల్సిందే అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

చట్టవిరుద్ధంగా రీవాల్యుయేషన్:మంత్రి దుర్గేష్

ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం జవాబు పత్రాలకు ‘రీవాల్యుయేషన్’ చేసే వెసులుబాటే లేదు, కేవలం మార్కుల రీ-కౌంటింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా మూడుసార్లు రీవాల్యుయేషన్ చేసి గత ప్రభుత్వ నాయకులు తమకు కావలసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని మంత్రి దుర్గేష్ ఫైర్ అయ్యారు. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన జవాబు పత్రాలలో ఏకంగా 95 శాతం పేపర్లలో వైట్ నర్లు రుద్ది, వేర్వేరు రంగుల ఇంకు పెన్నులతో మార్కులు మార్చి ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు సిట్ తేల్చిందని స్పష్టం చేశారు. అంతేగాక నిబంధనల ప్రకారం అత్యుత్తమ విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించాల్సి ఉండగా… నాటి ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ చదివిన సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించి తీవ్రమైన నేరానికి పాల్పడిందన్నారు. ప్రత్యేకించి నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు నామినేషన్ పద్ధతిలో ఎలాంటి టెండర్లు లేకుండా తన మిత్రుడి కంపెనీకే ఈ ప్రక్రియ బాధ్యతలు కట్టబెట్టడం అక్రమాలకు పరాకాష్ట అని విమర్శించారు.

అర్హులైన అభ్యర్థులకు అన్యాయం:మంత్రి దుర్గేష్
డిజిటల్ మూల్యాంకనంలో అర్హత సాధించిన 326 మంది అభ్యర్థులు… మాన్యువల్ మూల్యాంకనానికి వచ్చేసరికి 202 కి ఎలా పడిపోయారో గత ప్రభుత్వ నేతలు జవాబు చెప్పాలని మంత్రి దుర్గేష్ నిలదీశారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర సీసీ కెమెరాలు ఆపేసి, యాక్సెస్ రిజిస్టర్లు లేకుండా చేసి, పేపర్లు దిద్దే చోట ఫోన్లలో మాట్లాడుకుంటూ దొంగచాటుగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థి చేతే మెయిన్స్ పేపర్లు దిద్దించిన ఘనత గత ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇద్దరు ముగ్గురు పరిశీలకులతో దిద్దించాల్సిన ప్రక్రియను గాలికొదిలేసి, మూల్యాంకనకర్తలు వేసిన మార్కులకు… తుది ఫలితాల డేటాబేస్ లో ప్రత్యక్షమైన మార్కులకు హద్దు అదుపు లేకుండా తారుమారు చేశారని తద్వారా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. నియామక ప్రక్రియ ముగిసే వరకు పరీక్షల్లో జరిగే ప్రతి చిన్న మార్పును అభ్యర్థులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క మార్పుకు స్పష్టమైన కారణం చూపించకుండా అభ్యర్థులను చీకట్లో ఉంచి చీకటి రాజకీయం నడిపిందన్నారు. గ్రాస్ లెవెల్లో నిర్లక్ష్యం, నిధులు/అధికార మిస్ అప్రాప్రియేషన్ స్పష్టంగా జరిగిందని మంత్రి దుర్గేష్ మండిపడ్డారు.

ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ..రికార్డు సమయంలో భర్తీ ప్రక్రియ:మంత్రి దుర్గేష్
గత ప్రభుత్వం ‘మెగా డీఎస్సీ’ అని ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను దగా చేస్తే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేశారని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.
రికార్డు స్థాయిలో కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి అభ్యర్థుల కలలను నెరవేర్చామన్నారు. నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా భర్తీ ప్రక్రియ ముగిసిందన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం అనేది చాలా విలువైన సాధనం, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తే పిల్ ఉద్దేశమే దెబ్బతింటుందని కోర్టు తెలిపినా కూడా గత ప్రభుత్వాధినేత, నేతల వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయం అన్నారు.

అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్:మంత్రి దుర్గేష్
డీఎస్సీలో ఉద్యోగం రాని అభ్యర్థులు నిరాశ పడవద్దని, అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. బాగా చదివే వారికి మరో మంచి అవకాశం దక్కుతుందని భరోసా ఇచ్చారు. దయచేసి గత పాలకుల విషప్రచారాలు నమ్మకుండా శ్రద్ధగా చదువుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. అసలు గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అయినా వేశారా? వేయకపోవడానికి గల కారణాలేంటో చెప్పగలరా? అసలు ఏనాడైనా డీఎస్సీ వేయని మీరు… మేము అత్యంత పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తే సీబీఐ విచారణ అడగటం విడ్డూరంగా ఉందని అన్నారు.

అసెంబ్లీకి రాకుండా దొంగ నాటకాలు:మంత్రి దుర్గేష్
ప్రభుత్వ జీతాలు, సౌకర్యాలు అనుభవిస్తూ శాసనసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడే ధైర్యం విపక్ష నేతలకు ఎందుకు లేదని, దమ్ముంటే అసెంబ్లీ వేదికగా డీఎస్సీపై, ప్రజా సమస్యలపై చర్చకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ సవాల్ విసిరారు. ఉండ్రాజవరం మండల విపక్ష నాయకులు ఈ నిజాలు తెలుసుకోకుండా డీఎస్సీపై ర్యాలీలు చేయడం సిగ్గుచేటని, గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌ల వద్ద ధర్నాలు చేస్తే హౌస్ అరెస్టులు చేయించిన చరిత్ర గత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.

మంత్రి లోకేష్ రాజీనామా డిమాండ్‌పై మంత్రి దుర్గేష్ మండిపాటు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి వేలాది ఉద్యోగాలు ఇస్తుంటే… గత పాలకుల పాపాలకు లోకేష్ రాజీనామా చేయాలనడం గురివింద గింజ సామెతను గుర్తుచేస్తోందన్నారు. సీబీఐ విచారణ కోరే అర్హత గత పాలకులకు అసలే లేదన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల నేతృత్వంలో రాష్ట్రంలో “డబల్ ఇంజిన్ సర్కార్” వేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని, నిరుద్యోగులు విపక్ష నేతల విషప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు.

చనిపోయిన వారిని పరామర్శించరు గానీ… ఆస్తుల విధ్వంసమే ధ్యేయమా?:మంత్రి దుర్గేష్
చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించని గత పాలకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి … రోడ్లమీదికొచ్చి బలప్రదర్శనలు చేయడం, ఆస్తులను విధ్వంసం చేయడం, వ్యాపారాలు చేసుకునే వారి వ్యాపారాలను నాశనం చేయడమే యాత్రల ఉద్దేశంగా పెట్టుకున్నారని మంత్రి దుర్గేష్ ఫైర్ అయ్యారు. ప్రజలు మీ నాటకాలను చూస్తూ ఊరుకోరు, గతంలో 11 సీట్లకు పరిమితమైన మిమ్మల్ని త్వరలోనే సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయడం ఖాయం అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *