-ఉండ్రాజవరంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని పిలుపు
-పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో రూ.3 కోట్లతో కోట సత్తెమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు
-ఉండ్రాజవరంలో ఘనంగా ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం ఉండ్రాజవరం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల కాలంలో పర్యాటక రంగంలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, 117 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో నిడదవోలును ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’లో చేర్చామని, ప్రసిద్ధ కోట సత్తెమ్మ తల్లి ఆలయంలో భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో చర్చించానని, త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే రాబోతున్న స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉండ్రాజవరంలో ఉత్సాహంగా ‘తిరంగా ర్యాలీ’..ప్రజానీకానికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్ సమావేశానికి ముందు ఉండ్రాజవరం చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్‌కు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘తిరంగా ర్యాలీ’లో మంత్రి దుర్గేష్ చేతిలో జాతీయ జెండా చేతబూని “భారత్ మాతాకీ జై” అంటూ స్థానిక వీధుల్లో ప్రజలు, నాయకులతో కలిసి నడిచారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి దుర్గేష్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల త్యాగఫలాలను నేటి సమాజానికి, అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తనకు అప్పగించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలకు బాధ్యతాయుతంగా న్యాయం చేస్తూ, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.
Prajavartha Online Telugu News