Breaking News

శాసన మండలి, శాసన సభ సమావేశాల నిర్వహణకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి

-పెండింగ్ ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు అందించాలి
-సభ్యుల మెడికల్ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి
-సభ్యుల పింఛను పెంపు ప్రతిపాదనలను త్వరితగతిన పరిష్కరించాలి
-సభా హామీల అమలుకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి
-శాంతిభద్రతలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు, అధునాతన సాంకేతిక నిఘా
-డిజిటల్ పాస్‌ల స్కానింగ్ అనంతరమే సభా ప్రాంగణాల్లోకి అనుమతి
-శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అమరావతిలోని శాసన సభ ప్రాంగణంలో శాసన మండలి, శాసన సభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతిభద్రతలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను సమీక్షించేందుకు సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, సాధారణా పరిపాలనా శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, అదనపు డీజీపీ మధుసూదన రెడ్డితో వారు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు…
ఈ సందర్భంగా శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల మాట్లాడుతూ, సభా సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి సకాలంలో, స్పష్టంగా, సమగ్రంగా సమాధానాలు అందేలా పటిష్టమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్నలు ఏవైనా ఉంటే, అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ సంక్షిప్త సమాధానం అందించాలని సూచించారు.

అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలను సమీక్షించి, వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని, అవసరమైన చోట చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించి పెండింగ్ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. శాసన మండలి, శాసన సభల గౌరవాన్ని, సభ్యుల హక్కులను దృష్టిలో ఉంచుకుని ప్రశ్నలకు సమాధానాల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

సభా హామీల అమలుకు పటిష్టమైన వ్యవస్థ…
సభా సమావేశాల సందర్భంగా మంత్రులు, సంబంధిత శాఖల తరఫున ఇచ్చే హామీల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని వారు అధికారులకు సూచించారు. సభలో ఇచ్చిన హామీలను సంబంధిత శాఖలు నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేసేలా పర్యవేక్షణ, సమీక్షకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు.

సభా హామీల అమలులో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచడంతో పాటు, హామీల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా పటిష్టమైన వ్యవస్థను అమలు చేయాలని సూచించారు.

సభ్యుల మెడికల్ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి…
శాసన మండలి, శాసన సభ సభ్యులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై కూడా వారు అధికారులతో చర్చించారు. సభ్యుల పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపులను సత్వరమే పరిష్కరించి, అర్హత కలిగిన క్లెయిమ్‌లకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ బిల్లుల పరిష్కారంలో ఏవైనా పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

సభ్యుల పింఛను పెంపు ప్రతిపాదనలపై త్వరిత నిర్ణయం…
అదేవిధంగా సభ్యుల పింఛను సొమ్మును పెంచేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను కూడా సత్వరమే పరిశీలించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఒక కొలిక్కి తీసుకురావాలని శాసన మండలి అధ్యక్షులు, శాసన సభ స్పీకర్ అధికారులకు సూచించారు. సభ్యుల పింఛను పెంపు అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల స్థితిగతులు, అవసరమైన పరిపాలనా చర్యలు, ఆర్థికపరమైన అంశాలను సమీక్షించి, వీలైనంత త్వరగా తగిన నిర్ణయానికి రావాలని ఆదేశించారు.

డిజిటల్ పాస్‌ల విధానం అమలు…
అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల మాట్లాడుతూ, శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు డీజీపీ మధుసూదన రెడ్డిని ఆదేశించారు.

ఈ సమావేశాల్లో ఈసారి డిజిటల్ పాస్‌ల విధానాన్ని అమలు చేస్తున్నందున, పాస్‌లను తప్పనిసరిగా స్కాన్ చేసి, వాటి ధ్రువీకరణ అనంతరం మాత్రమే సంబంధిత వ్యక్తులను శాసన మండలి, శాసన సభ ప్రాంగణాల్లోకి అనుమతించాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

డిజిటల్ పాస్‌ల వినియోగం, స్కానింగ్, ధ్రువీకరణ ప్రక్రియపై భద్రతా సిబ్బందికి ముందుగానే పూర్తి అవగాహన కల్పించాలని, అనుమతించబడిన వ్యక్తులకే నిబంధనల ప్రకారం ప్రవేశం కల్పించేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.

మన సభ – జన సభ కార్యక్రమానికి ప్రత్యేక భద్రత…
మన సభ – జన సభ’ కార్యక్రమాన్ని నేడు, రేపు నిర్వహిస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి శాసన మండలి, శాసన సభ ప్రాంగణాల్లోకి సందర్శకులను అనుమతించే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పీకర్ సూచించారు. సందర్శకుల ప్రవేశం, డిజిటల్ పాస్‌ల పరిశీలన, వాహనాల రాకపోకలు, పార్కింగ్, భద్రతా తనిఖీలు తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా లోపాలపై ప్రత్యేక దృష్టి…
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లలో ఎక్కడైనా లోపాలు, గ్యాప్‌లు ఉన్నాయో ముందుగానే గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో సరిదిద్దాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల పోలీస్ అధికారులకు సూచించారు.

సచివాలయం చుట్టూ విస్తృతంగా ఖాళీ ప్రాంతాలు ఉన్నందున, భద్రతాపరంగా ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సచివాలయం, శాసన మండలి, శాసన సభ ప్రాంగణాల నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు, అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థలను వినియోగించి నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.

సీసీటీవీ కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ భద్రతను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఎటువంటి ఏమరపాటుకు తావులేకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి అంశాన్ని ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్ ఆదేశించారు.

సభా సమావేశాలు జరిగే సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సందర్శకుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా, అదే సమయంలో భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశాల్లో శాసన సభ డిప్యుటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు, శాసన సభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, గుంటూరు ఎస్.పీ. వకుల్ జిందాల్, సీఎం సెక్యూరిటీ ఎస్.పీ. భద్రయ్య, జాయింట్ సెక్రటరీ విజయరాజు, డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *