-ప్రజలను ప్రజాస్వామ్యానికి మరింత చేరువ చేయడమే లక్ష్యం
-శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు,శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహిస్తూ,ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో చేపట్టిన ‘మన సభ – జన సభ’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, ఏపీ పోలీస్ బ్రాస్ బ్యాండ్ సింఫనీతో సందడిగా మారింది. ప్రజలు,విద్యార్థులకు అసెంబ్లీ ప్రాంగణంలోకి ఉచిత ప్రవేశం కల్పించి ఉభయ సభల సందర్శనకు అవకాశం కల్పించడం విశేష ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ, ‘మన సభ – జన సభ’ కార్యక్రమం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమన్నారు. తాను గతంలో సామాన్యుడిగా ఉన్నప్పుడు శాసనసభ ప్రాంగణంలోకి రావడానికి అవకాశం ఉండేది కాదని, ప్రస్తుతం సామాన్య ప్రజలకు సైతం ఉభయ సభలను సందర్శించే అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు. ప్రజలను ప్రజాస్వామ్య వ్యవస్థకు చేరువ చేసే ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలను ప్రజాస్వామ్యానికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘మన సభ – జన సభ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శాసనసభ కేవలం ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే భవనం మాత్రమే కాదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిధ్వనిగా నిలిచే ప్రజాస్వామ్య దేవాలయం అని అభివర్ణించారు.
రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు అసెంబ్లీ గ్యాలరీ నుంచి శాసనసభా కార్యక్రమాలను వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని, యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే రాజకీయ వ్యవస్థ మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉంటుందని అన్నారు. గతంలో రాజకీయాలు ఉన్నత విలువలు, ఆదర్శాలతో కొనసాగేవని గుర్తుచేశారు. ప్రజలకు శాసనసభ సందర్శన వంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు, శాసన వ్యవస్థకు మధ్య అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు సైతం అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పించడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ‘మన సభ – జన సభ’ కార్యక్రమం ప్రజలకు శాసన వ్యవస్థను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసం శాసనసభ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర మాట్లాడుతూ, ‘మన సభ – జన సభ’ కార్యక్రమం శాసన వ్యవస్థలోనే ఒక వినూత్న నిర్ణయమని కొనియాడారు. ప్రజల మధ్య, ప్రజల భాగస్వామ్యంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికున్న ఆసక్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా కె.ఎల్. యూనివర్సిటీ విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆహూతులను, సందర్శకులను ఉత్సాహపరిచాయి. ఏపీ పోలీస్ బ్రాస్ బ్యాండ్ సింఫనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కాజ వెంకట సుబ్రమణ్యం శిష్యురాలు ఇరుకులపాటి లక్ష్మీ సహస్ర ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అనంతరం విద్యార్థులు, ప్రజలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించి ఉభయ సభల సందర్శనకు అవకాశం కల్పించారు. అసెంబ్లీ భవనం, శాసనసభ, శాసన మండలి కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాలను సందర్శించిన ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు.
ఆగస్టు 14, 15 తేదీల్లో సాయంత్రం వేళల్లో ప్రజలు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో అసెంబ్లీ ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రజలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలన్న నిర్ణయం పట్ల సందర్శకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
శనివారం సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉభయ సభల సందర్శనకు ప్రజలకు అవకాశం కల్పించనున్నట్లు శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News