అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత జాతీయ పతాకాన్ని అత్యంత గౌరవంతో, సముచితమైన పద్ధతిలో ప్రదర్శించేలా *‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002’*తో పాటు ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్–1971’ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలు, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచించింది. 2021, 2022 సంవత్సరాల్లో సవరించిన ఫ్లాగ్ కోడ్ నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పరిపాలకులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన సమాచారంలో, భారత జాతీయ పతాకం దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొంది. అందువల్ల జాతీయ పతాకానికి ఎల్లప్పుడూ గౌరవప్రదమైన స్థానం కల్పించాలని స్పష్టం చేసింది. జాతీయ పతాకంపై ప్రజలకు అపారమైన ప్రేమ, గౌరవం, విధేయత ఉన్నప్పటికీ.. పతాకాన్ని ఎగురవేయడం, ప్రదర్శించడం, వినియోగించడాన్ని నియంత్రించే చట్టాలు, నిబంధనలు, సంప్రదాయాలపై ప్రజల్లోనే కాకుండా కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల్లోనూ తగిన అవగాహన కొరవడిన సందర్భాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.
కాగితపు జాతీయ పతాకాలను నేలపై పడేయరాదు
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002లోని పార్ట్–II, పేరా 2.2లోని క్లాజ్ (x) ప్రకారం, ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల సందర్భంగా ప్రజలు కాగితంతో తయారు చేసిన జాతీయ పతాకాలను ఎగురవేయవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే కార్యక్రమాలు ముగిసిన అనంతరం కాగితపు జాతీయ పతాకాలను నేలపై పడేయడం, విసిరేయడం లేదా నిర్లక్ష్యంగా వదిలివేయడం చేయరాదని స్పష్టం చేసింది. జాతీయ పతాక ఔన్నత్యం, గౌరవం ఏమాత్రం దెబ్బతినకుండా వాటిని ప్రైవేట్‌గా, గౌరవప్రదమైన రీతిలో పారవేయాలని సూచించింది.
జాతీయ పతాకం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు అన్ని ప్రభుత్వ, సంబంధిత అధికార సంస్థలు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల రూపంలో ఈ అంశంపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది.
జాతీయ పతాక ప్రదర్శనపై ముఖ్యమైన నిబంధనలు
2021 డిసెంబర్ 30న చేసిన సవరణ అనంతరం జాతీయ పతాకాన్ని చేతితో వడికిన, చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని లేదా సిల్క్ ఖాదీ బంటింగ్తో తయారు చేయవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు వేడుకలతో సంబంధం ఉన్నా లేకపోయినా, అన్ని రోజుల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేయవచ్చు లేదా ప్రదర్శించవచ్చు. అయితే అది జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
2022 జూలై 19న చేసిన మరో సవరణ ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రజల ఇళ్లపై ప్రదర్శించే జాతీయ పతాకాన్ని పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు.
ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ పతాకం దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. పతాకం పరిమాణం ఏదైనా కావచ్చు కానీ పొడవు : ఎత్తు/వెడల్పు నిష్పత్తి ఎల్లప్పుడూ 3:2గా ఉండాలి.
జాతీయ పతాకాన్ని ప్రదర్శించే ప్రతిసారీ దానికి గౌరవప్రదమైన, ప్రత్యేకమైన స్థానం కల్పించాలి. చిరిగిన, దెబ్బతిన్న, నలిగిన లేదా అస్తవ్యస్తంగా ఉన్న జాతీయ పతాకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించరాదు.
ఒకే జెండా స్తంభంపై అదే సమయంలో జాతీయ పతాకంతో పాటు మరే ఇతర పతాకాన్ని ఎగురవేయరాదు. జాతీయ పతాకం కంటే పైన లేదా దాని మీదుగా మరే ఇతర జెండా, బంటింగ్‌ను ఉంచరాదు. అలాగే జాతీయ పతాకానికి పక్కన కూడా ఇతర జెండా లేదా బంటింగ్‌ను ఉంచరాదు.
వాహనాలపై జాతీయ పతాక ప్రదర్శనకు నిర్దిష్ట నిబంధనలు
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పార్ట్–III, సెక్షన్–IXలో పేర్కొన్న నిర్దిష్ట హోదాల్లో ఉన్న ప్రముఖుల వాహనాలు మినహా, ఇతర వాహనాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. ఈ జాబితాలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు తదితర ప్రముఖులు ఉన్నారు.
జాతీయ పతాకం వినియోగం, ఎగురవేత, ప్రదర్శనకు సంబంధించిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా–2002 (2021, 2022 సవరణలతో), అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్–1971 ప్రతులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రజల అవగాహన కోసం అందుబాటులో ఉన్నాయి.
జాతీయ పతాకం దేశ గౌరవానికి, ప్రజల ఐక్యతకు, ఆశలు–ఆకాంక్షలకు ప్రతీక. ప్రతి ఒక్కరూ దాని ఔన్నత్యాన్ని, పవిత్రతను, గౌరవాన్ని కాపాడేలా ఫ్లాగ్ కోడ్ నిబంధనలను పాటించాలి.
Prajavartha Online Telugu News