-భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశం
-బాలల సంరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత….
-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జువైనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) చట్టం–2015 అమలుకు దశాబ్దం పూర్తైన సందర్భంగా “చట్టం అమలు – దశాబ్దం ప్రస్థానం, భవిష్యత్ కార్యాచరణ” అంశంపై రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని శనివారం విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ హాజరై మాట్లాడుతూ.. ఈ సందర్భంగా జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, ఈ సదస్సు కేవలం లాంఛనప్రాయ కార్యక్రమంగా ముగిసిపోకుండా, బాలల భవిష్యత్తు కోసం చేసే కీలక పెట్టుబడిగా ప్రతి ఒక్కరూ భావించాలని పిలుపునిచ్చారు. చట్టంతో విభేదించిన బాలలైనా, సంరక్షణ మరియు రక్షణ అవసరమైన బాలలైనా వారిని ముందుగా పిల్లలుగానే చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. వారు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలు, పేదరికం, సహజ దుర్బలత్వాన్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలవాలని సూచించారు.
దేశవ్యాప్తంగా జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక బాలల రక్షణ యూనిట్లు వంటి వ్యవస్థలు విస్తరించినప్పటికీ, శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, బాలల అనుకూల విధానాల అమలులో లోపాలు వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయని తెలిపారు. వీటిని అధిగమించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ బెదిరింపులు, ఆన్‌లైన్ వేధింపులు వంటి కొత్త సవాళ్లు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు న్యాయ, పోలీసు, మహిళా–శిశు సంక్షేమ శాఖలు వేగంగా, సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
బాలల రక్షణలో ఏ ఒక్క వ్యవస్థ ఒంటరిగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించలేదని, పోలీసు, న్యాయ వ్యవస్థ, మహిళా–శిశు సంక్షేమ శాఖలు, న్యాయ సేవాధికార సంస్థలు, పౌర సమాజం సమన్వయంతో పనిచేసినప్పుడే సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లలను చూసి నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా స్పందించాలని పిలుపునిచ్చారు. పిల్లలే దేశానికి అత్యంత విలువైన సంపద అని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా వివిధ ప్రతికూల పరిస్థితులను అధిగమించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన 21 మంది బాలలను జస్టిస్ లిసా గిల్ ఘనంగా సత్కరించారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, పరిమితులు కేవలం మన ఆలోచనల్లోనే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. సదస్సులో జరిగే చర్చలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఫలితాల ఆధారిత కార్యాచరణగా రూపుదిద్దుకుని సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడాలని ఆకాంక్షించారు.
శిక్ష ఒక్కటే పరిష్కారం కాదు: జస్టిస్ బట్టు దేవానంద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, జువైనల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక పోలీసు యూనిట్ల ఏర్పాటు ద్వారా బాలల రక్షణ వ్యవస్థ విస్తరించిందన్నారు. అయితే పేదరికం, పట్టణీకరణ, నిరక్షరాస్యత తదితర కారణాలతో నేరాల బాట పడుతున్న బాలల విషయంలో నిర్బంధం లేదా శిక్ష ఒక్కటే అంతిమ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. పిల్లలను నిరంతరం నిందితులుగా చూడకుండా, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని, సంరక్షణ, రక్షణ, విద్య, పునరావాసానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, కేసుల విచారణలో జాప్యం,పోలీసు–న్యాయ–సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం వంటి సవాళ్లను అధిగమించేందుకు కచ్చితమైన సమాచారం, గణాంకాల ఆధారంగా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టంతో సంబంధం ఏర్పడిన ప్రతి చిన్నారికి ఆత్మగౌరవం, భద్రత, నాణ్యమైన విద్య, అవసరమైన సంరక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని, వారు భవిష్యత్తులో సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా ఎదిగేలా సమగ్ర కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో సంస్థాగత సంరక్షణ, దత్తత ప్రక్రియలో సంస్కరణలు, పిల్లల పట్ల స్నేహపూర్వక పోలీసింగ్, మానసిక ఆరోగ్యం, సమగ్ర పునరావాసం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ శాఖల అధికారులు, న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థల ప్రతినిధులు, బాలల సంక్షేమ రంగానికి చెందిన నిపుణులు, ఇతర ప్రతినిధులకు జస్టిస్ బట్టు దేవానంద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జువైనైల్ జస్టిస్ చట్టం అమలులో గత పదేళ్లలో సాధించిన పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, బాలల సంరక్షణ మరియు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
హైకోర్టు జడ్జి, జువెనైల్ జస్టిస్ కమిటీ సభ్యులు జస్టిస్ చల్లా గుణరంజన్ మాట్లాడుతూ…. జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ & రక్షణ) చట్టం, 2015’ అమలులోకి వచ్చి ఒక దశాబ్దం పూర్తయిందని, ఇది కేవలం సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికే కాకుండా, చట్టం అందించిన భరోసా ప్రతి చిన్నారికి న్యాయ రూపంలో నిజంగా చేరిందా లేదా అని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. జువైనల్ జస్టిస్ చట్టం మానవతా దృక్పథంపై ఆధారపడి ఉందన్నారు. చట్టంతో విభేదించే లేదా సంరక్షణ అవసరమైన ప్రతి బిడ్డ కేవలం కేసు మాత్రమే కాదని, గౌరవం, భద్రత, అభివృద్ధి, సంరక్షణ మరియు భవిష్యత్తు పొందే హక్కు ఉన్న ఒక వ్యక్తి అన్నారు. వ్యవస్థ విజయం కేవలం పరిష్కరించిన కేసుల సంఖ్య లేదా ఉత్తర్వులపై కాకుండా, వ్యవస్థలోకి వచ్చిన చిన్నారి మెరుగైన ఆశ, ఆత్మగౌరవం, భద్రతతో తిరిగి బయటకు వస్తున్నారా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ఏ ఒక్క విభాగం బాధ్యతో కాదని పోలీసు అధికారి, జువైనల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సోషల్ వర్కర్లు, సంరక్షణ సంస్థలు, వైద్యులు, న్యాయవ్యవస్థ అంతా కలిసి ఒకే ప్రయాణంలో భాగస్వాములుగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. గత పదేళ్లలో ఏం పనిచేసింది, లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాబోయే దశాబ్దానికి కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం, పునరావాసం, సామాజిక పునరేకీకరణ, పిల్లల మానసిక ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మరియు సంస్థల పర్యవేక్షణపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. సాంకేతికత కేసుల పర్యవేక్షణకు, రికార్డుల నిర్వహణకు తోడ్పడవచ్చు కానీ, అది ఎప్పటికీ మానవీయ స్పర్శను భర్తీ చేయలేదన్నారు. భాగస్వామ్య వర్గాలన్నీ కలిసికట్టుగా స్పష్టమైన కార్యాచరణ వ్యూహాలతో పనిచేసి, రాబోయే దశాబ్దంలో మరింత బాధ్యతాయుతమైన, పటిష్టమైన జువైనల్ జస్టిస్ వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షించారు.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… జువైనల్ జస్టిస్ వ్యవస్థ అనేది కేవలం చట్టాలు, విధివిధానాలు లేదా కేసుల పరిష్కారాలకే పరిమితం కాదని, ఆపదలో ఉన్న ప్రతి చిన్నారి బాల్యాన్ని కాపాడి, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించి, వారికి మెరుగైన భవిష్యత్తును కల్పించడమే దాని అసలైన లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ అనేది ఏ ఒక్క శాఖతోనో సాధ్యం కాదని, ప్రభుత్వం మరియు సమాజం రెండూ కలిసి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత దశాబ్దపు విజయాలు, లోపాలను సమీక్షించుకుంటూ, విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, పిల్లల సకాల పునరావాసం మరియు సంరక్షణ కోసం రాబోయే దశాబ్దానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ, జేజే చట్టం అమలుపై జరిగిన సమీక్షలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి. సూర్యకుమారి మాట్లాడుతూ.. జువైనల్ జస్టిస్ (జేజే) చట్టం అమలు కేవలం శాఖాపరమైన బాధ్యత కాదని, బాలల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే సామాజిక బాధ్యత అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి. సూర్యకుమారి అన్నారు. తల్లిపాలు ప్రతి శిశువు ప్రాథమిక హక్కు అని బాల్య వివాహాలు, బాలకార్మికత, డ్రాపౌట్లను అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా రూ.5 వేల కోట్ల వరకు తల్లీబిడ్డల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
చైల్డ్ హెల్ప్‌లైన్‌కు వచ్చే కాల్స్‌లో 4 వేలకు పైగా బాల్య వివాహాలకు సంబంధించినవేనని, టీనేజ్ ప్రెగ్నెన్సీలను నివారించేందుకు ‘కిశోరి వికాసం’ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. పోషకాహారం, పోక్సో, బహిష్టు పరిశుభ్రత, సైబర్ సెక్యూరిటీ, ఆత్మరక్షణ తదితర అంశాలపై 30 లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించని బాలల సంరక్షణ కేంద్రాలను మూసివేసి, ప్రమాణాలు పాటించిన 476 కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. కాంట్రాక్ట్ సిబ్బందిపై ఆధారపడటం తగ్గించి శాశ్వత సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ‘పిల్లలే సంపద’ అనే నినాదంతో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మార్పులో ఒక దశాబ్దం – ప్రభావాన్ని అంచనా వేయడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై సాంకేతిక సమావేశం–III నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్. భానుమతి సమావేశానికి చైర్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, జువైనల్ జస్టిస్ కమిటీ సభ్యురాలు జస్టిస్ కిరణ్మయ్ మండవ కో-చైర్‌గా వ్యవహరించారు. సమావేశంలో జస్టిస్ బి.ఎస్. భానుమతి చైర్ ప్రసంగం చేసారు. అనంతరం జస్టిస్ కిరణ్మయ్ మండవ అభిప్రాయాలు, సమీక్షను వెల్లడించారు.
జువైనల్ విభాగం డైరెక్టర్ (FAC) వి. వసంతబాల “డేటా పరిణామం, పర్యవేక్షణ, విధానాలు మరియు అమలులో ఉన్న లోపాలు” అనే అంశంపై ప్రసంగించారు. APSLSA మెంబర్ సెక్రటరీ బి.ఎస్.వి. హిమబిందు, UNICEFలోని CPSS యూనిట్ హెడ్ డా. ఇసిడోర్ ఫిలిప్స్, వివిధ భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం మరియు భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
బాలల విద్య , మానసిక సంరక్షణ, ఆరోగ్యం పై సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు వివరించారు.
బాలల సంరక్షణ, మానసిక ఆరోగ్యం మరియు ఉద్భవిస్తున్న సమస్యలపై మంగళగిరి ఎయిమ్స్ ప్రొఫెసర్ మరియు హెచ్వోడీ డా. అవుల విజయచంద్రా రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) చిన్నంశెట్టి రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో జువైనల్ జస్టిస్ కమిటీ సభ్యులు జస్టిస్ వి. సుజాత, డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప, జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కె. సురేష్ రెడ్డి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హెచ్. అమర రంగేశ్వరరావు, రిజిస్ట్రార్లు, ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తులు, మిషన్ వాత్సల్య జాయింట్ డైరెక్టర్ శిరీష మరియు సిబ్బంది, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జువైనల్ జస్టిస్ బోర్డులు మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీల సభ్యులు, పోలీస్, న్యాయవ్యవస్థ, న్యాయ సేవాధికార సంస్థలు, శిశు సంరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs) మరియు పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News