విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం అరండల్‌పేట ప్రాంతంలో రోడ్లపై వాహనాలను నిలిపి డ్రైనేజీ మార్గాలను, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఆక్రమణలకు పాల్పడుతున్న ఆటో కన్సల్టెంట్లపై చర్యలు చేపట్టారు.
25వ డివిజన్ అరండల్‌పేటలోని పలు ఆటో కన్సల్టెన్సీల వద్ద రోడ్లపై వాహనాలను పెద్ద సంఖ్యలో నిలిపి ఉంచడం వల్ల మురుగునీటి కాలువలను శుభ్రపరిచే పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనాల కారణంగా కాలువలపైకి సిబ్బంది, యంత్రాలు చేరుకోలేకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, వర్షాల సమయంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రోడ్లను ఆక్రమించి వాహనాలను నిలిపి ఉంచడం, డ్రైనేజీ మార్గాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్, పోలీస్ మరియు ప్రజారోగ్య విభాగాల సమన్వయంతో ఇటువంటి సమస్యలపై నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ చర్యల్లో భాగంగా అరండల్‌పేటలోని సంబంధిత ఆటో కన్సల్టెన్సీలకు నోటీసులు జారీ చేసి, రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలను మూడు రోజుల్లోగా తొలగించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా వాహనాలను తొలగించకపోతే సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నగరంలోని వ్యాపార సంస్థలు, ఆటో కన్సల్టెంట్లు తమ కార్యకలాపాల కోసం రోడ్లను ఆక్రమించకుండా, ప్రజల రాకపోకలకు, పారిశుధ్య నిర్వహణకు మరియు డ్రైనేజీ వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరించాలని నగరపాలక సంస్థ అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సెక్రటరీలు, సిబ్బంది పాల్గొని సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
Prajavartha Online Telugu News