-డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘జాతీయ విదేశీ విద్యా ఉపకార వేతనం’ (NFPwD)ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం (Divyangjan) ద్వారా బెంచ్‌మార్క్ దివ్యాంగుల కోసం ఈ జాతీయ విదేశీ విద్యా ఉపకార వేతన పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు మరియు విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులను అభ్యసించేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు.
ఈ ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాస్టర్స్ డిగ్రీ కోసం సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలో, అలాగే పీహెచ్‌డీ కోసం సంబంధిత మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్ సాధించి ఉండాలని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు పథక మార్గదర్శకాలకు అనుగుణంగా ట్యూషన్ ఫీజు, నిర్వహణ భత్యం, అనుబంధ/కాంటింజెన్సీ భత్యం, విమాన ప్రయాణ ఖర్చులు, వీసా రుసుము, వైద్య బీమా వంటి ఖర్చులకు ఆర్థిక సహాయం లభిస్తుందని తెలిపారు.
అర్హత కలిగిన బెంచ్‌మార్క్ దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తూ, పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు మరియు ఇతర వివరాల కోసం కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://depwd.gov.in/ ను సందర్శించాలని ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News