-పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో మూడు రోజుల్లో 11 వేలకు పైగా దరఖాస్తులు: సీఎండీ పి. పుల్లారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా నిర్వహించిన “సేవా సేతు అభియాన్” క్యాంపులకు విశేష స్పందన లభించిందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని సబ్ డివిజన్, జిల్లా స్థాయిలో 70కి పైగా నిర్వహించిన క్యాంపుల ద్వారా 11 వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్ల) పరిధిలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సబ్ డివిజన్ స్థాయిలో “సేవా సేతు అభియాన్” క్యాంపులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సీఎండీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.మూడు రోజులపాటు నిర్వహించిన ఈ క్యాంపుల్లో రాష్ట్ర మంత్రులు, ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(జేఎండీ),జిల్లాకలెక్టర్లు,శాసనసభ్యులు,ఇతరప్రజాప్రతినిధులు,RECఅధికారులు,బ్యాంకర్లు, సోలార్ విక్రేతలు, విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారని సీఎండీ తెలిపారు. ప్రజలకు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఇంటి పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలను తెలియజేసి, గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించారని పేర్కొన్నారు.అర్హత ఉన్న ప్రతి గృహ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తన ఇంటినే విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని సీఎండీ పి. పుల్లారెడ్డి పిలుపునిచ్చారు.రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.ప్రజలు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించాలని సీఎండీ పి. పుల్లారెడ్డి కోరారు.
Prajavartha Online Telugu News