రాజమహేంద్రవరం నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్. కె. ప్రత్యూష కుమారి వారి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక మహిళా కారాగారము నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళల హక్కులు, బాధ్యతల గురించి ప్రత్యూష కుమారి తెలియజేశారు. మహిళలు వారి హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు వారి బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. ఒక కుటుంబానికి మార్గ నిర్దేశకంగా మహిళ ఉండాలని అన్నారు. అనవసరమైన తగాదాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఖైదీలతో చెప్పారు. మహిళల సాధికారతకు కృషి చేసిన వారిని స్పూర్తిగా తీసుకుని అత్యున్నత స్థాయికి మహిళలు ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్ వసంత కుమారి, కారాగార సిబ్బంది పాల్గొన్నారు.
వ్యర్థాలను సేకరించే మహిళలకి న్యాయ విజ్ఞన అవగాహన సదస్సు
అనంతరం రాజమహేంద్రవరం హరిత దళం ఎన్.జీ.వో వారి సహకారంతో వేస్ట్ పిక్కర్ మహిళల కోసం స్థానిక సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు మెరుగైన సమాజ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర అని ప్రత్యూష కుమారి వివరించారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో, ధైర్య సహసాలతో వారి పట్ల జరిగే అన్యాయాలను ఎదిరించి పోరాడాలని పిలుపు నిచ్చారు. మహిళా శక్తి దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని, ఈ విషయంలో యువత పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఎన్.జీ.వో సంస్థలు, వారి ప్రతినిధులు, చెత్త సేకరించే మహిళలు, తదితరులు పాల్గొన్నాయి.
Prajavartha Online Telugu News