విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం దారుణంగా ఉంటుందని నాణ్యమైన సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఊర్మిళానగర్‌లోని గాంధీ ట్రస్ట్ ఆశ్రమంలో గాంధీ నాగరాజన్ మహాత్మా గాంధీ హత్యకు గురైన 30వ తేదీని పురస్కరించుకొని ప్రతినెల 30వ తేదీన కళ్ళకు గంతలతో నిరాహార దీక్ష చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని మంత్రులు గాని, అధికారులు గానీ తినగలరా అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాటి వరకు తాను కూడా రేషన్ బియ్యం తింటానని చెప్పారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ బడి పిల్లలకు పెట్టిన బియ్యంతోనే తాను కూడా భోజనం చేశారని, అటువంటి స్ఫూర్తి నేటి నాయకుల్లో కొరవడిరదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఓట్లను కొనే వారికి ఓటేయకండని పిలుపునిచ్చారు. పనికి ఆహార పధకం దారి మళ్లుతోందని ఆ పనులు కూడా చిన్న పిల్లలతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలైన నాడే నిజమైన మహిళ సాధికారత లభించగలదని అన్నారు. వాస్తవానికి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ఆనాడే మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని గాంధీ నాగరాజన్ కోరారు. నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం ట్రస్టు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి.భారతి ఆశ్రమ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News