విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ యొక్క సెంట్రలైజడ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ మధ్యాహ్న భోజనం పధకమైన “జగనన్న గోరుముద్ద పథకం” ద్వారా 30,000 మంది పిల్లలకు ఇక్కడి నుండి దాదాపు 25 వాహనాలతో ఇన్సులేటెడ్ కంటైనర్లలో ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ అని ఇది భారతదేశంలో మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లల పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ-సహాయక పాఠశాలల్లో , మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ద్వారా, అక్షయపాత్ర ఆకలిని తీర్చడంతో పాటు ప్రతిరోజు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సంతోషించదగిన అంశమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనేక మంది దాతల మద్దతుతో, అక్షయ పాత్ర ప్రారంభం నుండి పిల్లలకు సేవలందిస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయికి ఎదిగిందని అన్నారు. తనకు ఇక్కడకు రావటం చాల సంతోషంగా ఉందన్నారు అలాగే తన వంతు సహాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అక్షయ పాత్ర మంగళగిరి అధ్యక్షులు వంశీధర దాస మాట్లాడుతూ, ఆచార్యులు జగద్గురు శ్రీ ప్రభుపాదుల వారి ఆశయాలతో 1500 మందితో ప్రారంభమైన మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా అక్షయ పాత్ర ఈరోజు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతంలోని దాదాపు 20,000 పైగా పాఠశాలలలో 22 లక్షల పైగా పిల్లలకు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోంద న్నారు. అదే సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అలాగే ఈ రోజు ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు అక్షయ పాత్రకు వచ్చి తమను ప్రోత్సాహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలాస విగ్రహ దాస అక్షయ పాత్ర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News