– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-59 వ డివిజన్ 254 వ సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59 వ డివిజన్ 254 వ వార్డు సచివాలయ పరిధి అజిత్ సింగ్ నగర్లో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. 250 గడపలను సందర్శించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమంపై ఆరా తీస్తున్నప్పుడు వారి స్పందన, ప్రభుత్వంపై వారికి ఉన్న ప్రేమను స్పష్టం చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. అండగా నిలుస్తున్నారని లబ్ధిదారులు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. అటువంటి వ్యవస్థను బదనాం చేసేందుకు ప్రతిపక్షాలు యత్నించడం బాధాకరమన్నారు. ఈ వ్యవస్థపై టీడీపీలోనే ఏకాభిప్రాయం లేదని.. వాలంటీర్లను కొనసాగిస్తామని ఒకరు అంటే., అధికారంలోకి రాగానే తొలగిస్తామంటూ మరొకరు మాట్లాడుతున్నారన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
లోకేష్ అవుట్ డేటెడ్ నాయకుడు
తెలుగుదేశం నాయకుల మాటలు కోటలు దాటుతున్నా.. సభలు మాత్రం వెలవెలబోతున్నాయని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళమే ఇందుకు నిదర్శనమన్నారు. లోకేష్ ఒక అవుట్ డేటెడ్ నాయకుడని.. యువగళం ఒక అట్టర్ ఫ్లాప్ షో అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పకుండా, తిరిగి అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో వివరించడం గత పాలకుల చేతగానితనానికి అద్దం పడుతోందన్నారు. మూడు సార్లు అధికారంలోకి ఉండి పేదల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకొచ్చేలా ఒక్క మంచి కార్యక్రమాన్ని అయినా చంద్రబాబు చేపట్టారా..? కనీసం ప్రజలందరూ గుర్తుంచుకునేలా ఏ ఒక్క మంచి సంక్షేమ పథకాన్ని అయినా ప్రవేశపెట్టారా..? సమాధానం చెప్పాలన్నారు. మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయినా.. ఉత్తర కుమార ప్రగల్భాలను లోకేష్ నేటికీ మానుకోలేదని వ్యాఖ్యానించారు. అడ్డదార్లలో ఎమ్మెల్సీ, ఆ తరువాత మంత్రి పదవి అవడం కాదని.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో గెలిచి మాట్లాడాలన్నారు.
లోకేష్ యాత్ర ఎందుకో ఆయనకైనా తెలుసా..?
రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్న అక్కసు, సంక్షేమ పాలనలను చూసి ఓర్వలేనితనం లోకేష్ మాటల్లో స్పష్టంగా కనిపించిందని మల్లాది విష్ణు అన్నారు. యువగళం పేరుతో నారాలోకేష్ చేస్తున్న యాత్ర ఎందుకో కనీసం ఆయనకైనా తెలుసా..? అని ప్రశ్నించారు. పాదయాత్ర అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా ప్రజలతో మమేకమై సాగాలని సూచించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించేలా ఉండాలన్నారు. అంతేగాని అధికారం ఉంటే అందినంత అడ్డగోలుగా దోచుకోవడం, దాచుకోవడం కాదన్నారు. ఇకనైనా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఉనికిని చాటుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. అనంతరం సచివాలయ పరిధిలో ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, చింతా శ్రీను, కృష్ణ, కంభగళ్ల రాజు, అమిత్, షేక్ వెంకట్, షఫీ, నేరెళ్ల శివ, నాయక్, దినేష్ రెడ్డి, నాగలక్ష్మి, బాబా, అఫ్జల్ భాష, షేక్ జిలాని, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News