-జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలన 40 శాతం పైగా పూర్తి చేసాం…
-ఈ నెల21 లోగా నూరుశాతం పూర్తి చేస్తాం..
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్వచ్చీకరణకు అన్ని రాజకీయ పక్షాలు తమ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు అన్నారు.
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సంయుక్త సవరణలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా పరిశీలనను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్ల (బిఎల్ఏ)ను, బూతు స్థాయి అధికారుల (బిఎల్ఓ) సమన్వయముతో ఓటర్ల జాబితా సవరణను నిర్దేశించిన గడువు లాగా స్వచ్చీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇందుకు రాజకీయ పక్షాల ప్రతినిధుల సహకారం కూడా తోడు కావాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి ఓటర్ల జాబితా వెరిఫికేషన్ నేటి వరకు 40శాతం పైగా పూర్తి చేశామని, ఈనెల 21 వ తేదీ లోగా నూరు శాతం సర్వే పూర్తి చేస్తామన్నారు. జాబితా పరిశీలనతో పాటు 18 నుండి 19 సంవత్సరాల యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓ లను ఆదేశించామన్నారు. అర్హులైన ఏ ఒక్కరినీ ఓటర్ల జాబితా నుండి తొలగించబోమని, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చెప్పారు. నూరుశాతం స్వచ్చీకరణతో ఎటువంటి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు ప్రతినిధులు ప్రస్తుతం జరుగుతున్న డోర్ టు డోర్ వెరిఫికేషన్ పక్కాగా జరుగుతుందని ఎటువంటి ఫిర్యాదులు లేవన్నారు. బిఎల్వోలు పరిశీలనను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈనెల 21 చివరి తేదీ అయినందున మరికొన్ని రోజులు పెంచేలా ఎన్నికల సంఘాన్ని కోరాలని, బిఎల్ఓ లకు వేరే విధులు అప్పగించరాదని జిల్లా కలెక్టర్ ఢల్లీి రావు దృష్టికి తీసుకొచ్చారు.సమావేశంలో డిఆర్ఓ కే.మోహన్ కుమార్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై ఆంజనేయ రెడ్డి, టీడీపీ ప్రతినిధి ఎల్ శివరాం ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పి. ఏసుదాస్, సిపిఐ ప్రతినిధి బి.బి బాలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News