విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ సమాజం లో నైనా హింస హానికరం అని, రాజకీయ హింస ను సభ్య సమాజం ఖండించాలని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. స్థానిక ఒక ప్రయివేటు సమావేశ మందిరం లో “ఆంధ్ర ప్రదేశ్ లో హింసా రాజకీయాలు, నివారణ చర్యలు – మీడియా పాత్ర ” అంశంపై సి.ఆర్. మీడియా అకాడమీ, ఎడిటర్స్ అసోసియేషన్ లు సంయుక్తంగా గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సు కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పుంగనూరు లో జరిగిన సంఘటన నేపథ్యంలో “రాజకీయ హింస” పై మేధావులు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఏర్పడిందని కొమ్మినేని అన్నారు. తెలంగాణ లో నిర్మల్ వద్ద అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు జైలు శిక్ష అనుభవించిన సంగతి గుర్తుచేస్తూ, నేరపూరిత ప్రవర్తన, శాంతి భద్రతల విఘాతం వంటి దుశ్చర్యలకు పాల్పడడం అంటే శిక్ష అనుభవించేందుకు స్వయంగా సిద్ధ పడడమే అన్నారు. , నేర పూరిత స్వభావం కలిగినసాధారణ వ్యక్తులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అందుకు ప్రభుత్వాలు చట్ట ప్రకారం శిక్షిస్తుందని అన్నారు. అయితే, ఇలా హింసను ప్రేరేపించిన వ్యక్తి ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కావడం మన దురదృష్టం అని ఆయన అన్నారు. ఈ సంఘటనలో హింసకు పాల్పడినవారెవరో, బాధితులెవరో అందరికీ తెల్సినా, కొన్ని పత్రికలు, వార్తా చానెళ్లు, “టి.డి. పి. కార్యకర్తలు తిరగబడ్డారని”, “పోలీసులదే తప్పని” వక్రీకరించిన వార్తలు రాయడం, ప్రసారం చేయడం జరుగుతోందని విమర్శించారు. ఈ హింసా కాండ లో కన్ను కోల్పోయిన కానిస్టేబుల్ పై కనీస సానుభూతి చూపని ప్రధాన ప్రతి పక్ష నేత, రాజకీయ పక్ష నేతలు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ప్రజల రక్షణ లో తమ కన్ను కోల్పోయిన కానిస్టేబుల్ కు సదస్సు సంఘీభావం ప్రకటించింది. రోడ్ షో ల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, మారణ హోమం జరుగుతుందని ప్రభుత్వ వాదన కోర్టుల్లో నిల్వ లేదని, దాని పర్యవసానమే ఈ సంఘటన అని ఆయన అన్నారు.ముఖ్య అతిథి గా హాజరైన అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి. విజయ్ బాబు మాట్లాడుతూ పోలీసుల పైజరిగిన దాడులకు చంద్ర బాబు ప్రజలకు జావాబు చెప్పాలన్నారు. ఈ సంఘటన పై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ తక్షణమే స్పందించాల్సి ఉందన్నారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. రాజ్యాధికారాన్ని గెలుచుకోవాలి అంటే, ప్రజల మనస్సు గెలుచుకోవాలని ఆయన అన్నారు. అంతేగాని, అల్లర్లు,అరాచకం సృష్టించడం తగదు అని ఆయన అన్నారు. వజ్ర పోలీస్ వాహనానికి నిప్పు పెట్టడాన్ని ప్రమాడు వశాత్తు తగలబడినట్లు రాస్తే అది పత్రికా విలువల్ని కాలరాయడమే అన్నారు.నవరత్నాలు అమలు కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నారాయణ రావు మాట్లాడుతూ రాజకీయాలను అడ్డుపెట్టుకుని హింసను ప్రోత్సహించడం సరైన పద్దతి కాదని, ఇటువంటి చర్యలను అరికట్టాల్సి ఉందని అన్నారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్. కృష్ణంరాజు మాట్లాడుతూ ఏదోవిధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం హింసను ప్రేరేపించడం సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అరాచక, తీవ్రవాద రాజకీయ ధోరణులు మొగ్గలోనే త్రుంచి వేయాలన్నారు. ఈ సంఘటన పై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రిటైర్డ్ జిల్లా పోలీస్ సూపరింటెండ్ చక్రపాణి మాట్లాడుతూ ప్రతిపక్షాలు విధాన పరమైన లోపాల్ని ఎత్తి చూపాలే తప్ప అరాచక ధోరణులకు తెగబడకూడదు అన్నారు. శ్రీమతి లక్కరాజు సునీత మాట్లాడుతూ “ఫ్రస్ట్రేషన్” తోనే ఇటువంటి దాడులకు ప్రతిపక్ష నేతలు పాల్పడుతున్నారన్నారు. సదస్సులో ఆకుల శ్రీనివాసులు, జి.శాంతమూర్తి, రెహ్మాన్ సాహెబ్, వెంకట్ ఎస్. మేడపాటి, సలాది పూర్ణ చంద్రరావు మలిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News