గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
సఫాయి కార్మికులతో ప్రమాదకరంగా ఓపెన్ డ్రైన్స్ ల్లో పనులు చేయించరాదని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి.వావ అన్నారు. సోమవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సఫాయి కర్మచారి కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు వావ నగరపాలక సంస్థ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ వావ మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం నిరంతరం కృషి చేశారన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించి, ప్రీమియం నగరపాలక సంస్థే చెల్లించడం అభినందనీయమన్నారు. సదరు ఇన్సూరెన్స్ వలన ప్రమాదవశాత్తు ఎవరైనా కార్మికులు మరణిస్తే రూ.17 లక్షల వరకు పరిహారం అందుతుందని తెలిపారు. కార్మికులతో నేరుగా డ్రైనేజి పనులు చేయించవద్దని, డ్రైనేజి శుభ్రానికి సఫాయి కర్మచారి కమిషన్ ద్వారా సబ్సిడీ పై యంత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా కొంత మంది సఫాయి కార్మికులకు సబ్సిడీ పై పారిశుధ్య వాహనాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. కార్మికులు ఎక్కువ మంది పిఎఫ్ అంశం పై ఫిర్యాదు చేశారని, సంబందిత అధికారులతో జిఎంసి అధికారులు మాట్లాడాలని త్వరలో జాతీయ స్థాయిలో పిఎఫ్ విభాగ అధికారుల దృష్టికి కూడా సమస్య తీసుకెల్తామని తెలిపారు. మరో 15 రోజుల్లో ప్రతి కార్మికునికి పిఎఫ్,ఈఎస్ఐ నంబర్ తో కూడిన ఐడి కార్డ్ లు అందించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులను తక్కువగా చూసిన, వివక్షత చూపినట్టు ఫిర్యాదులు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.
నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ పెద్ది రోజా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి గురువారం గ్రీవెన్స్ జరుపుతున్నామన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి, సదరు ప్రీమియం కూడా నగరపాలక సంస్థే చెల్లిస్తుందని తెలిపారు. కమిషన్ సభ్యులు సూచించిన విధంగా త్వరలో కార్మికులు, ఆయా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, జిఎంసి పరిధిలోని సమస్యలు పరిష్కారనికి చర్యలు తీసుకుంటామన్నారు.తొలుత గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సోమి శంకరరావు, ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ.మధుబాబు, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.ముత్యాలరావు, పారిశుధ్య పనివారల సంఘం అధ్యక్షులు మరియన్న, ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె.మాల్యాద్రి తదితర కార్మిక సంఘాల నాయకులు సఫాయి కార్మికుల సమస్యల పై మాట్లాడుతూ అవుట్ సోర్శింగ్ కార్మికులకు బ్యాంక్ రుణాలు ఇప్పించాలని, గుంటూరు నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, కార్మికులకు రక్షణ పరికరాలు, కనీస వేతనం ఇవ్వాలని, కార్మికుల సమస్యల ఫిర్యాదులు స్వీకరణకు మెయిన్ ఆఫీస్ లో సూపరిండెంట్ క్యాడర్ అధికారిని కేటాయించాలని, యూనియన్ కార్యాలయాలకు స్థల కేటాయింపు చేయాలని, జగనన్న కాలనీల్లో కార్మికులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి.వావ దృష్టికి తెచ్చి, వినతి పత్రాలు అందించారు. సదరు అంశంపై వావ మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు టి.వెంకట కృష్ణయ్య, డి.రవీంధ్ర, ఎస్.ఈ. భాస్కర్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, అప్కాస్, కార్మిక శాఖ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News