తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో మొబైల్ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆధార్ క్యాంపు నందు పొందగల సేవలు ఏవంటే… నూతనంగా ఆధార్ కార్డు నమోదు, 5 సం. మరియు 15 సంవత్సరాలు దాటిన బాల బాలికలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సేవలు పూర్తి ఉచితంగా పొందవచ్చును. ఆధార్ కార్డ్ ప్రింట్ కొరకు రూ. 30, ఇంటి చిరునామా మార్పు కొరకు రూ.50, ఇంటి చిరునామాతో పాటు బయోమెట్రిక్ అప్డేట్ కొరకు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుందని, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2010 నుండి 2016 సంవత్సరాల మధ్య ఆధార్ నమోదు చేసుకొని, తర్వాత ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోని వారు ఏదైనా రుజువు సమర్పించి తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని, దీని కొరకు రూ.50 రుసుము చెల్లించవలెనని వారు తెలిపారు.నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లా పరిధిలోని పౌరులు తమ ఆధార్ కార్డు చిరునామాలో పాత జిల్లాల పేర్లను తిరుపతి జిల్లాగా మార్చుకొనుటకు ఆధార్ ప్రాధికార సంస్థ ద్వారా అవకాశం కల్పించబడిందని, మీ సమీపంలోని ఆధార్ క్యాంపు యొక్క వివరాల కోసం సమీప గ్రామ, వార్డు సచివాలయాన్ని లేదా మీ వాలంటీర్ ను సంప్రదించాలని, తిరుపతి జిల్లా నందు ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయం ద్వారా 2,52,755 ఆధార్ సేవలను ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు.కావున తిరుపతి జిల్లాలోని ప్రజలందరూ ఆధార్ క్యాంపు లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News