– ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం స్పందన
– జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన(గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉద్యగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాధవీ లత, జేసీ ఎన్. తేజ్ భరత్ డిఆర్వో నరశింహులతో కలసి ఉద్యోగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈసందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తెలుసుకొని వాటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేసేందుకు ప్రతి మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసామన్నారు. ఈ రోజు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి 13 అర్జీలను స్వీకరించామని కలెక్టరు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి భరోసా కలుగ చెయ్యడం కోసమే ఈ ప్రత్యేక స్పందన ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. సర్వీస్ మేటర్, పదోన్నతులు, ఇతర సమస్యలను తెలుసుకుని ఆ మేరకు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వాటిలో ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావలసిన వాటిని ఆయాశాఖాధిపతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగుల స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు డ్వామా కార్యాలయం టెక్నికల్ అసిస్టెంట్ నిడదవోలు లో పనిచేస్తున్న గొల్లపల్లి కాంతారావు తమ అర్జీలో సస్పెన్షన్ ఉతర్వులు రద్దు చేసి తిరిగి పోస్టింగ్ ఇప్పించాలని వారు అర్జీలో కోరారు. ఈ అంశంపై కలెక్టరుస్పందిస్తూ తగు చర్యలు చేపట్టాలని డ్వామా పీడి కి ఆదేశాలు జారీచేశారు. పబ్లిక్ హెల్త్ మరియు ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ లో వర్కు ఇన్స్ పెక్టరుగా కాకినాడలో పనిచేస్తున్న పిల్లి బీమ శంకర రావు తమ అర్జీలో కాడర్ స్ట్రెంత్ సీఎఫ్ ఎం ఎస్ ఐడీ క్రియేట్ చేసి తనకు రావలసిన జీతం భత్యాలు ఇప్పించాలని కోరారు. దీని పై కలెక్టరు స్పందిస్తూ ఈఈ పబ్లిక్ హెల్త్ అధికారిని ఆదేశిస్తూ గు అర్జీదారుని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట -1 సచివాలయం ఉద్యోగి టి. నాగభూషణం తమ అర్జీలో ఉండ్రాజవరం మండలం వెలివెన్ను-2 నుంచి తాళ్లపూడి మండలం అన్నదేవరపేట -1 సచివాలయం కు బదలీపై 2023 ఆగస్టు 25 రావడం జరిగిందని అయితే అప్పటి నుంచి తనకు రావలసిన జీత భత్యములు రావడం లేదని, ఇప్పించవలసిదిగా కోరారు. కలెక్టరు స్పందిస్తూ జిల్లా ట్రైజరీ అధికారి వెంటనే సదరు ఉద్యోగికి సంబందించిన జీతము వారి ఖాతాకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ పనిచేస్తున్నఎస్.కే. జాని జిల్లాల వికేంద్రీకరణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కు కేటాయించారు. అయితే అప్పటి నుంచి క్లాస్ ఫోర్ జీపీ ఎస్ ఖాతా ఏలూరు నుంచి రాజమహేంద్రవరంకు బదలీ కాలేదని కావున జీపీ ఎస్ అకౌట్ బదలీ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు అర్జీలో కోరారు. దీని పై కలెక్టరు స్పందిస్తూ జిల్లా ట్రైజరీ అధికారికి తగు ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ , జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మిమ్మితి భాను ప్రకాష్ రెడ్డి, పి.సువర్ణ, సిపివో ఏ. ముఖ లింగం, ఎస్ ఈ పిఆర్ ఏ బి వి ప్రసాద్, పీడీ డ్వామా పి. జగదాంబ, డా ఎస్ జి టి సత్య గోవింద్, ఎస్ ఈ ఆర్ అండ్ బి ఎస్ బి వి రెడ్డి, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, మార్కెటింగ్ ఏ డీ ఏం.సునీల్ వినయ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి, కే ఎస్ జ్యోతి, ఆర్టీసి డి టి వో షర్మిలా అశోక్, డి.ఎమ్.హెచ్.వో. డా కె. వేంకటేశ్వర రావు, డి ఈ వో ఎస్. అబ్రహం, ఇతర జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News