రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రబీ 2023 – 24 పంట కాలానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో 1180 ఎకరాలలో అపరాలు వేయడానికి రాయితీపై విత్తనాల కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలో భాగంగా ఖరిఫ్-2023 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 22 శాతం వరి కోతలు పూర్తి అవ్వడం జరిగినదని అధికారులు వివరించినట్లు పేర్కొన్నారు. రానున్న రబీ సీజన్ నాట్లు డిసెంబర్ చివరినాటికి పూర్తి చేసే కార్యాచరణ నేపథ్యంలో , 2023 నవంబర్ నెల ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో కోతలు పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేసి, ఆమేరకు రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో దాదాపు 90 శాతం వరికోతలు పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్ వివరణ ఇచ్చారు.అపరాలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో పంటలు వేసేందుకు ముందుకు వస్తున్న రైతులకు ఈ సబ్సిడీపై అందించే విత్తనాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మినుములు 71 క్వింటాళ్ళు, పెసలు 4 క్వింటాళ్ళు, ఉలవలు 10 క్వింటాళ్ళు, అలసందలు 10 క్వింటాళ్ళు, నువ్వులు ఒక క్వింటా వెరసి మొత్తం 96 క్వింటాళ్ళ విత్తనాలను రాయితీ పై అందించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. అదే విధంగా అర్భికే స్థాయిలో రైతులు సకాలంలో నాట్లు చేపట్టి పూర్తి చేసేందుకు రెండు సార్లు రైతులతో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రబీ, 2023-24 లో నీటి లభ్యత ఉన్న రైతులు డిసెంబర్ మొదటివారం నుండి వెదజల్లే విధానంలో వరిసాగును చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. వెదజల్లే విధానం అవలంబించడం ద్వారా వినియోగం, కూలీ ఖర్చులు మరియు 7 రోజుల పంట కాలం తగ్గించుకోవచ్చునని తెలిపారు. నీటి వినియోగం సద్వినియోగం చేసుకోవాలని ప్రస్తుత 2023-24 రబీ పంట సాగు ముందస్తుగా వేయుటకు రైతులకు, గ్రామ వ్యవసాయ సలహా మండలి ద్వారా అవగాహన సదస్సులను ఈనెల 18 మరియు 24 వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News