-ప్రత్యేక ఆకర్షణగా భారత రాజ్యాంగ పుస్తక ప్రతి ప్రదర్శన
-జాతీయ గీతాన్ని హృదయ భవాంతరాల్లోంచి పాడాలి
-ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఏడాది నవంబర్ 26 న జాతీయ న్యాయ దినోత్సవంగా, రాజ్యాంగ దినోత్సవంగా, వరకట్న వ్యతిరేక దినోత్సవాలని జరుపుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ఆదివారం ఉదయంఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన లా, రాజ్యాంగ , వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు, ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జాతీయ న్యాయ , రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియ చేశారు. రాజ్యాంగ రచన ప్రాముఖ్యతను వివరిస్తూ , 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని స్వీకరించడం జరిగిందన్నారు. దేశంలో 1950 జనవరి 26 నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. భారత దేశంలోని పౌరులు గానీ , పరిపాలన వ్యవస్థలు గానీ, రెవెన్యూ, న్యాయ వ్యవస్థ లు, పోలీసు వ్యవస్థ, రాజ్యాంగ, రాజ్యాంగేతర సంస్థలు, కంపెనీ లు దేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం నడుచు కొనవలెను అని పేర్కొన్నారు. భగవత్ గీత ను హిందువులు, బైబిల్ ను క్రైస్తవులు , ఖురాన్ ను ముస్లిం లు ఎలాగైతే పవిత్రంగా భావిస్తారో, భారత దేశ పౌరులు ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం పట్ల అంతే పవిత్ర భావనతో ఉండాలని కోరారు. రాజ్యాంగ రచనను చేతితోనే రాయడం జరిగిందని ఇది ప్రతి ఒక్క భారతీయునికి ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. చేతి రాత తో మన రాజ్యాంగం నాలుగు పర్యాయాలు రాసి తుదకు పుస్తక రూపంలో తీసుకుని వచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. నేడు ఆ పుస్తక నమునా ప్రతిని తీసుకుని వచ్చి విద్యార్థులకు చూపించడం జరిగింది. జాతీయ గీతాన్ని ఆలపించే సందర్భంలో హృదయ భావాంతరాల్లోంచి పాడాలని పిలుపు నిచ్చారు. తొలుత కళాశాల ఆవరణలో ఉన్న భారత రత్న డా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ధృవ పత్రాలు అందజేశారు. అనంతరం ఎన్.సి.సి. విద్యార్థుల , కళాశాల విద్యార్థులతో కలిసి ఫోటో దిగారు. విద్యార్ధిని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు . కార్యక్రమం చివరిలో ఆర్ట్స్ కళాశాల నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి & సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యూష కుమారి , కుటుంబ న్యాయస్థానం, 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. మాధురి, కంట్రోలర్ ఎగ్జామ్స్ పి. బాబ్జీ, జోన్ 1&2 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (కాలేజీలు) డా చప్పిడి కృష్ణ, సీనియర్ న్యాయవాది పి. శ్రీనివాస రావు, కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్ కె. రామచంద్ర రావు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయ వాదులు, లెక్చరర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News