రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి లాలాచెరువు సమీపంలోని చేంజెస్ ఎన్.జీ.ఓ. కార్యాలయం వద్ద “ట్రాన్స్ జెండర్లు మరియు సెక్స్ వర్కర్ల సంక్షేమం” మరియు “మానవ హక్కుల” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల హక్కులు గురించి వివరించారు. ట్రాన్స్ జెండర్లు మరియు సెక్స్ వర్కర్ల సాధికారత కోసం అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ పథకాల గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాల లబ్ధిని పొందాలని అన్నారు. సెక్స్ వర్కర్లు, హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తుల విషయంలో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీం కోర్టు వారు వెలువరించిన ప్రముఖ తీర్పుల ద్వారా ఇచ్చిన ఆదేశాల గురించి మరియు “హెచ్.ఐ.వి. మరియు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ చట్టం, 2017” గురించి వివరించారు. ఎవ్వరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం నిరాకరించబడరాదని అన్నారు. ఎవరికి ఎలాంటి న్యాయ సమస్యలు, సందేహాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు. ఈ సదస్సులో డా. ఎన్. వసుంధర, ఏ.ఆర్.టి. సెంటర్ మెడికల్ ఆఫీసర్ డా. యు.టి. కిరణ్, రాజమహేంద్రవరం దిశా పోలీస్ సి.ఐ. రమణమ్మ, చేంజెస్ ఎన్.జి.ఓ కార్యదర్శి జి. రామ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News