– కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
150 అడుగుల జాతీయ పతాకాన్ని ఆష్కరించేందుకు గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ఈ నెల 16న జగ్గయ్యపేటలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం జగ్గయ్యపేట విష్ణుప్రియ నగర్, తిరంగా పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ గవర్నర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరంగా పార్కుకు చేరుకొని అనంతరం రూ. 60 లక్షలతో ఏర్పాటుచేసిన 150 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జగ్గయ్యపేట మునిసిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్రగారు; స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు ప్రసంగించిన అనంతరం ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తారని వివరించారు. గవర్నర్ పర్యటనను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట మునిసిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ తుమ్మల ప్రభాకర్, సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి.వెంకటేశ్వర్లు, నందిగామ ఆర్‌డీవో పి.సాయిబాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ గింజపల్లి వెంకటరామయ్య, దుర్గగుడి డైరెక్టర్ నంబూరి రవి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News