-రైతు అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఔషధ, సుగంధ మొక్కల పెంపకం ప్రాథమిక ప్రాసెసింగ్, నాణ్యత, విలువ జోడింపు మరియు మార్కెటింగ్ అంశాలపై CSIR-CIMAP ప్రాంతీయ పరిశోధనా స్థానం, హైదరాబాద్ వారు ICAR-NIRCA (CTRI) మరియు కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల వారి సౌజన్యంతో రైతు అవగాహన సదస్సును 16.02.2024వ తేదీన సి.టి.ఆర్.ఐ సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ICAR-CTRI, DIRECTOR, Dr. మాగంటి శేషు మాధవ్ అధ్యక్షత వహించగా CSIR కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల సంస్థ పరిశోధనా కేంద్రం హైదరాబాద్ శాస్త్రవేత్తలు డా జె కొటేష్ కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, Er. జి. కిరణ్ బాబు, చీఫ్ సైంటిస్ట్ డా కెవిఏన్ సత్యా శ్రీనివాస, శాస్త్రవేత్తలు, కేవీకే అధికారులు, ఎఫ్ పి వో సభ్యులు, రైతులు, ఎపి సీఎన్ఎఫ్ సభ్యులు, రైతు మహిళలు పాల్గొన్నారు. Dr. వి.ఎస్.జి.ఆర్. నాయుడు, హెడ్, కెవికె, కలవచర్ల స్వాగతోపన్యాసం చేస్తూ ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకం పై జిల్లాలోని రైతులను ప్రోత్సహించే దిశగా CIMAP- కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల సంస్థ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం, హైదరాబాద్ వారి సహకారంతో ‘రైతు అవగాహన సదస్సు’ నిర్వహించడం జరిగిందని తెలిపారు. CIMAP శాస్త్రవేత్తలు డా జె. కోటేష్ కుమార్ వారి ప్రజెంటేషన్ లో నిమ్మగడ్డి, కాశ గడ్డి, కామాక్షి కసువు, వట్టివేరు, యూకలిప్టస్, తులసి, పచౌలి, కలబంద వంటి సుగంధ మరియు ఔషధ పంటల సాగు వివరాలను, వాటి ఔషధ గుణాల నాణ్యత, నర్సరీ పెంపకం అంశాలను రైతులకు వివరించారు. నేల సానుకూలతను బట్టి ఔషధ మొక్కలను సాగు చేపట్టాలని సూచించారు. Central Institute of Medicinal & Aromatic Plants, Lucknow (CSIR-CIMAP)చీఫ్ శాస్త్రవేత్త Er. జీడి కిరణ్ బాబు ప్రజెంటేషన్ లో ముఖ్యంగా సుగంధ మరియు ఔషధ మొక్కల సాగు అనంతరం వాటిని ఏ విధంగా డిస్టిలేషన్ చేసుకోవాలో రైతులకు వివరించారు. వివిధ రకాల ఔషధ మొక్కల స్వేదనం కు పట్టే సమయం, లభించే నూనె శాతం, తైలము నాణ్యత, మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ తైలాన్ని పొందడం వంటి అంశాలను వివరించారు. డా. కెవిఎన్ సత్య శ్రీనివాస్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మాట్లాడుతూ సుగంధ ఔషధ మొక్కల ఉత్పత్తులకు విలువ జోడింపు అంశంపై సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యంగా ఔషధ మొక్కగా గుర్తింపబడిన అశ్వగంధ పంట సాగు వివరాలు, అశ్వగంధ మొక్క వేర్లలో లభించే విథాఫిరిన్ ‘ఏ’ మరియు ‘బి’ రసాయనాలు ప్రాముఖ్యత, అశ్వగంధ వేర్లను ఆరబెట్టే విధానం, గ్రేడింగ్, మార్కెటింగ్ అంశాలను రైతులకు వివరించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 10,000 హెక్టార్లు సాగు చేయబడుతోందని, రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోందని తెలిపారు. డైరెక్టర్, ICAR-CTRI డా ఎమ్. శేషు మాధవ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ CSIR-CIMAP వారు నిర్వహించిన ఈ ‘రైతు అవగాహన సదస్సు’ ద్వారా జిల్లాలోని రైతులకు ముఖ్యంగా సుగంధ మరియు ఔషధ మొక్కలపై ఎంతో అవగాహన పెంపొందించే దిశగా నిర్వహించబడినదని, యువ రైతులు అంకుర సంస్థలుగా డిస్టిలేషన్ యూనిట్లను స్థాపించుకుని సుగంధ తైలాలను మార్కెటింగ్ చేసుకునే విధంగా CIMAP మరియు NIRCA (CTRI) శాస్త్రవేత్తల సలహాలను తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో NIRCA ద్వారా అశ్వగంధ సాగు, మార్కెటింగ్ అంశాలపై రైతులకు లబ్ధి చేకూరగలదని వివరించారు. ఈ సందర్భంగా CSIR-CIMAP సుగంధ ఔషధ మొక్కల వివరాలను తెలిపే కరపత్రాలను, నిమ్మగడ్డి రూట్ కటింగ్స్, పామరోజా విత్తనం, సుగంధ తైలాలను, అశ్వగంధ విత్తనాన్ని శాంపిల్ కిట్స్ రైతులకు ఉచితంగా అందించారు. గండేపల్లి గ్రామం అభ్యుదయ రైతు నరేంద్రబాబు ఈ రైతు సదస్సును ICAR-CTRI లో నిర్వహించడానికి కె . వి .కె, కలవచర్ల వారికి చాల సహకరించారు. ఈ సదస్సులో వివిధ మండలాల నుండి అభ్యుదయ రైతులు, కెవికె స్టాఫ్ సత్యవాణి, దిలీప్, రాజు, విజయ వర్ధన్, ప్రభాత్ నాయుడు,R. రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News