Breaking News

నగరంలో ఘనంగా ‘వారథి’ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం జరిగింది. ఆదివారం విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘వారథి’ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ రఘు రామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరాయి భాషలను నేర్చుకున్నా మాతృభాషను మరిచిపోకూడదని చెప్పారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం మరే ఇతర భాషల్లో ఉండదని, అందుకే దాన్ని ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అంటారన్నారు. మాతృభాషను ప్రేమించకుంటే తల్లిపై ప్రేమలేని వాడితో సమానమని అన్నారు. తెలుగు వారు భాషా మూలాలు మర్చిపోకుండా ఉండాలంటే వారికి మాతృభాషలో చదువుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలని అన్నారు. పక్క రాష్ట్రాల వారి పిల్లలకు వారి మాతృభాష గురించి చెప్పమనడం అంటే మన రాష్ట్రంలో తెలుగు వద్దని కాదని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పరాయి భాషలను నేర్చుకుందాం కానీ తెలుగును విస్మరించకూడదని పునరుద్ఘాటించారు. అందరూ తెలుగులో రాయగలగాలి, చదవగలగాలని ఆకాంక్షించారు. ఎన్నో సాహిత్య విలువలున్న తెలుగు భాష మనకుందని ఆయన చెప్పారు. అందుకే మనం మర్చిపోకూడదని, తెలుగు భాష సంపదను కాపాడుకుంటూ తెలుగువారందరినీ ఒక చోటకు చేర్చిన ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్‌బాబు, ప్రధాన కార్యదర్శి కంటే అశోక్‌, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు మాట్లాడాలంటే కొందరు ఫీలవుతున్నారని, కానీ తమిళనాడులో తమిళం మాట్లాడకపోతే ఫీలవుతారని గుర్తు చేశారు. మనం మనుగడ సాగించాలంటే ఇతర భాషలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి తప్ప మన భాషను మర్చిపోయి కాదని పునరుద్ఘాటించారు. ఇక్కడ పుట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మన భాషను ద్వేషిస్తే, ఎక్కడో మహారాష్ట్రలో నివసిస్తూ జగన్‌బాబు మన తెలుగు భాష మాట్లాడే వారందరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్రతోపాటు ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ లోగోను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమన్నారు. సినీ నటుడు సుమన్‌ మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో నటించడం వల్ల భాషపై మమకారం మరింత పెరిగిందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఎంతో చరిత్ర ఉందని, దాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ప్రతినిధులు, సాహిత్యప్రియులు, తెలుగు భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన (PGRS) అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి

-రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *