గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మిర్చి తొడెమెలు తీసే గోడౌన్ ల వ్యర్ధాల వలన ప్రజలు మిర్చికోరుతో ఇబ్బందులు పడుతున్నారని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్వహకులు తగు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి చుట్టగుంట సెంటర్ నుండి మిర్చి యార్డ్ వరకు పర్యటించి, మిర్చి తొడెమెల గూడౌన్ ల్లో పరిశీలించి యాజమాన్యాలతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, యాజమాన్యాలకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చుట్టగుంట పరిసర ప్రాంతాల పలు కాలనీల్లో మిర్చి తొడెమెల వలన తీవ్ర కోరుతో ఇబ్బందులు పడుతున్నట్లు, అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు ప్రజలు అనేక ఫిర్యాదులు అందిస్తున్నారని, తొడెమెలు తీసే గూడౌన్ నిర్వహకులు తక్షణం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. తొడెమెలను రోడ్ల మీద, డ్రైన్లలో వేయరాదని, అలా వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు తొడెమెలను దహనం చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి, భారీ అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. కొత్తకాలనీ మెయిన్ రోడ్ పై ఏర్పడిన పైప్ లైన్ లీకును మరమత్తు చేయాలని, ఎమినిటి కార్యదర్శులు ఎప్పటికప్పుడు సచివాలయం పరిధిలో లీకులను గుర్తించడం, మరమత్తులు చేయించాలని ఆదేశించారు.
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మాధవి మాట్లాడుతూ మిర్చి తొడెమెలు తీసే గూడౌన్లలో ఎక్కువ మంది మహిళా కార్మికులు పని చేస్తున్నారని, యాజమాన్యాలు వారికి త్రాగునీరు, టాయ్ లెట్స్ వంటి మౌలిక వసతులను కల్పించాలన్నారు. తొడెమెలను గుట్టలుగా మెయిన్ రోడ్ల పక్కన వేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని గూడౌన్ లోపలే స్టోర్ చేసుకోవాలన్నారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఈఈ కోటేశ్వరరావు, డిఈఈలు శ్రీనివాస్, మధుసూదన్, కార్పొరేటర్ అడకా పద్మావతి, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
